By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 2 Telugu, Question 129

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర రచన మూలాలు 19వ శతాబ్దంలో ఆరంభమై, 20వ శతాబ్ది తొలిదశకాలకు స్పష్టమైన రూపుదిద్దుకున్నాయి. సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయతాభావజాలం, ప్రత్యేకాంధ్ర ఉద్యమాల స్ఫూర్తితో ప్రభావితమై పెంపొందింది. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రకామండలి (1905) ద్వారా తెలుగు వారి చరిత్ర, సంస్కృతులకు శ్రీకారం చుట్టాడని పలువురి అభిప్రాయం. రూఢార్థంలో యిది వాస్తవమే! కానీ, అంతకుముందే కొందరు సాహిత్య మూర్తులు చరిత్ర రచనా ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించారన్న దాఖలాలున్నాయి. ‘మధురా విజయ’ (వీరకంపరాయచరిత్ర) మనే కావ్యాన్ని గంగాదేవి సంస్కృతంలో రచించారు. 14వ శతాబ్ది ఆఖర్లో జీవించిన గంగాదేవి క్రీ.శ. 1371 లో మధురను జయించిన వీరకంప రాయని భార్య. విజయనగర రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలలో బుక్కరాయల కుమారుడే ఈ వీరకంపరాయుడు. అప్పటి చారిత్రికాంశాలను నిర్దుష్ట కాలక్రమణిక ప్రకారం వర్ణించడం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. ఇది చరిత్ర రచన ఆరంభమేకాని నిజానికి చరిత్ర కాదు.

19వ శతాబ్ది పూర్వ భాగంలో కావలిసోదరుల సహాయంతో (కావలి వెంకట బొర్రయ్య, వెంకట రామస్వామి) చరిత్ర కనువైన, అరుదైన ఆధారాలను - స్థానిక విశేషాలు, తాళపత్ర ప్రతులు, అనువాదాలు, పటాలు, బొమ్మలు, పురావస్తు విశేషాలు. శిల్పాలు, రాతి, రాగి శాసనాలు, నాణేలు - సేకరించారు. శాసన లిపులను పరిష్కరించి, పరిశోధించి నివేదికలు తయారు చేశారు. కావలి వెంకట రామస్వామి రాసిన ‘దక్కన్ కవుల చరిత్ర’ దక్షిణ భారతదేశపు కవుల గూర్చిన చారిత్రక గ్రంథం. శాసనాలు, లిపులు పరిష్కరించిన కావలి వెంకట బొర్రయ్య వాస్తవంలో తెలుగువారి మొదటి చరిత్రకారుడుగా పరగణించవచ్చు!

కావలి సోదరుల తర్వాత ఆంధ్రుల చరిత్ర రచనలో బుక్కపట్నం రాఘవాచార్యుల గూర్చి ప్రస్తావించుకోవాలి. ఆంధ్రుల చరిత్రను గ్రంథస్థం చేసి అందులో కళింగరాజుల గూర్చి కొంత సమాచారాన్ని చేర్చాడు. ఈ గ్రంథం ప్రచురితమైందో లేదో తెలీదు. ఒకటికి పైగా సంపుటాలు బుక్కపట్నం వారు రాశారనీ, వాటిని అప్పటి మద్రాసు రాజధాని రెవెన్యూ బోర్డు సభ్యుడైన కార్మికేల్ అభిప్రాయం కోసం పంపాడని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రాశారు. మద్రాసు నగరంలోని గుజిలీ బజారులో రాఘవాచార్యుల రాతప్రతులను మానవల్లి రామకృష్ణ కవి చూశారని వేటూరి వారు అభిప్రాయ పడ్డారు. కాకతీయుల శాసనాల ఉటంకింపు రాఘవాచార్యులు చేశాడని, ‘కువలయాశ్వచరిత్ర’ రాశాడని శాస్త్రిగారు రాశారు. రాఘవాచార్యులు వినుకొండ వాసి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం చేశాడు.

20వ శతాబ్ది ప్రారంభంలో, రాబర్ట్ స్యూయల్ లండన్ నుండి ‘Forgotten Empire’ ప్రచురించాడు. ఆంధ్రుల గత చరిత్రపై లోతుగా పరిశోధనలు చేపట్టేందుకు ఈ గ్రంథం దోహదం చేసింది. పాశ్చాత్య విద్య. సాహిత్యాల పరిచయంతో తెలుగు దేశపు మేధావులు కొత్త సాహితీ ప్రక్రియలను చేపట్టారు. కందుకూరి వీరేశలింగం రచించిన ‘ఆంధ్రకవుల చరిత్రము’ దీనికొక వుదాహరణ. తెలుగు కవుల గూర్చి రాస్తూ. వీరేశలింగం ఆయా కవుల చారిత్రక నేపథ్యాన్ని గూడ వివరించాడు. ఒక సాహిత్యకారుని గూర్చిన చర్చలో లేదా ఒకరి జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు, వారి ‘కాలాన్ని’ (Times) గూర్చిన అవగాహన తప్పనిసరి.

1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఆంధ్రుల చరిత్రలో ఇదొక ముఖ్యఘట్టం. దీని వ్యవస్థాపకులు జయంతి రామయ్య పంతులు భాషా శాస్త్రవేత్త. శానన పరిశోధకులు. కడప శాసనాలను పరిష్కరించి వెలువరించిన ఘనత వీరిదే! ముందే చెప్పుకొన్నట్టు కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రికా మండలి, జాతీయ భావజాల ప్రేరణతో వచ్చిందే. ఉప్పెనలా ఎగసిన జాతీయతా భావాలు దేశీయ, ప్రాంతీయ చరిత్రల సృష్టికి ఎనలేని దోహదం చేశాయి. చరిత్ర రచనకు కావల్సిన పూర్వరంగాన్ని - పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాలను మండలి సేకరించింది. వచనంలో చరిత్ర, శాస్త్ర, కళావిషయాల పై రచనలు చేయించాలని విజ్ఞాన చంద్రికామండలి సంకల్పించింది. వీరి మొదటి గ్రంథం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రాసిన ‘అబ్రహం లింకన్’ జీవిత చరిత్ర. కొమర్రాజు వారు రాసిన హిందూదేశ సంగ్రహము (1907) ఏడు ముద్రణలతో మన్ననలు పొందింది. తన సహచరుడైన చిలుకూరి వీరభద్రరావును ఆంధ్రుల చరిత్రను మూడు సంపుటాల్లో రచించమని కోరాడు. గతాన్ని కీర్తించే జాతీయ చరిత్ర రచనా సంప్రదాయంలో ఈ చరిత్రలు రాశారు. ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాముఖ్యం ఈ సంపుటాల్లో లభించినా, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికాంశాల ప్రస్తావన సంతృప్తికరంగా లేదు. కొమర్రాజు రచనల్లో మతతత్వం చోటుచేసుకొందన్న విమర్శలొచ్చినా, తనది ఏ మాత్రం మత దృష్టికాదని కొమర్రాజు విమర్శలను ఖండించారు.

ఆంధ్రుల చరిత్రలో తర్వాత చెప్పుకోదగ్గ కూడలి తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ఆరంభమైంది. ఆంధ్రుల ప్రాచీనత, ఘనత, సాంస్కృతిక వారసత్వాలను వెలికితీసి, వాటికొక విశ్వసనీయతను కల్పించాల్సిన అవసరం వున్నదన్న ఆలోచన కలిగింది. జాతీయతకు భాషాపరమైన భావన బలంగాతోడై, 1925లో రాజమండ్రిలో Andhra Historical Research Society ఏర్పడింది. కొమర్రాజు సహచరులు, అనుచరుల్లో ముఖ్యులు - మల్లంపల్లి, చిలుకూరి, రాళ్లబండి, భావరాజు, న్యాపతి ప్రభృతులు ఈ సంస్థలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రాంతీయ, స్థానిక చరిత్రలకు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన శాసనాలు, నాణేలకు మెరుగులు దిద్దారు. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, ఆంధ్రుల తొలి రాజవంశాలు, తూర్పు గాంగులు తదితర రాజవంశాలపై పరిశోధనా గ్రంథాలతో పాటు రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక, రెడ్డిసంచిక, కళింగ సంచికలు వెలువడ్డాయి. క్రమం తప్పకుండా పరిశోధనా జర్నల్ (32 సంచికల)ను వెలువరించారు. తాళపత్ర వ్రాతప్రతుల కేటలాగును తయారుచేసి భావితరాలకు అందించింది.

1950 దశకానికి కొద్ది ముందు వెనుకలుగా ఆంధ్రుల చరిత్ర రచన గణనీయ మార్పులకు లోనైంది. 1949లో వెలువడ్డ సురవరం ప్రతాపరెడ్డి గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ సామాజిక చరిత్ర రచనకు శ్రీకారం చుట్టింది. జాతీయ, పునరుజ్జీవనోద్యమాల దశకంటె భిన్నంగా ఈ దశలో వెలువడ్డ చరిత్రలు మరింత సమగ్రతను సంతరించుకొని, ప్రభుత్వ నిర్మాణం, సామాజిక పరిస్థితులతోపాటు, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో జరిగిన మార్పుల గూర్చి వివరించాయి. కానీ, పురావస్తు పరిశోధనల్లో లభించిన ఆధారాలను సమర్థిస్తూ సాహిత్యాధారాలతో కలిపి పోల్చి చూడలేక పోయాయి. తొలి, మధ్యయుగాల్లో రాజవంశాల్లో, రాజవంశాల మధ్య జరిగిన కుట్రలు, చిన్నపాటి యుద్ధాల గూర్చి విమర్శనా దృష్టితో వివరించలేకపోయాయి. యధాలాప రాజకీయ ఘటనలు గానే వాటిని పరిగణించడంతో, రాజ్య నిర్వహణలో వున్న కీలకాంశాలను గ్రహించడంలో విఫలం చెందారు. మధ్యయుగాల నుండి ఆధునిక యుగానికి జరిగే పరిణామాన్ని, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో సంభవించే తీవ్రచారిత్రక మార్పుల పర్యవసానంగా విశ్లేషించడంలో కృతకృత్యులు కాలేకపోయారు. అప్పటి ఆర్థిక వ్యవస్థకు ఆటపట్టుగా నిల్చిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వర్గ సంబంధాలు, ఇస్లాం దండయాత్ర వల్ల కలిగిన ఫలితాలు, శైవ, వైష్ణవ మతశాఖల ప్రభావం, సామాజిక క్రమంలో కులవ్యవస్థ మార్పు చెందుతూ వచ్చిన తీరు, సూఫీ, భక్తివుద్యమాలు ఈ గ్రంథాల్లో ప్రస్తావనకు రాలేదు. జరిగిపోయిన చారిత్రక ఘటనల వర్ణనలకంటె, ఆ ఘటనల నేపథ్యాన్ని, అవి ఎందుకు ? ఎలా ? జరిగిన తీరును ఈ పరిశోధనలు చర్చించి వుండాల్సింది. ఈ దశలోనే, 1950 తర్వాత శ్రీయుతులు రామేశన్, రావిప్రోలు సుబ్రహ్మణ్యం, ఐ.కె. శర్మ, వి.వి. కృష్ణశాస్త్రి, మహమ్మద్ అబ్దుల్ వహద్‌ఖాన్, శ్రీనివాసాచారి, తిమ్మారెడ్డి, యం.యల్.కె. మూర్తి, పద్దయ్య, టి.వి.పతి, బి.యన్. శాస్త్రి, బి.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రభృతులు ప్రాక్-పురాయుగ (Pre and Proto) చరిత్ర పై ప్రామాణిక రచనలు చేశారు. సాహిత్య చరిత్ర, కళారంగాలపై పెర్సీబ్రౌన్ రీతిలో అమితారే, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, ఆరుద్ర, యన్.యస్. కృష్ణమూర్తి తదితరులు కృషి చేశారు.

Q129

విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకులు :

  1. (1) కొమర్రాజు లక్ష్మణరావుCorrect answer
  2. (2) కావలి వెంకట బొర్రయ్య
  3. (3) గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
  4. (4) చిలుకూరి వీరభద్రరావు

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) కొమర్రాజు లక్ష్మణరావు

  1. రెండో గద్యం మొదటి పేరాలోనే "కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రకామండలి (1905)" అని ఉంది.
  2. తర్వాతి భాగంలో కూడా ఇదే మాట మళ్ళీ చెప్పారు.

జాగ్రత్త: గాడిచెర్ల హరి సర్వోత్తమరావు మండలి మొదటి గ్రంథం రాశారు; చిలుకూరి వీరభద్రరావు కొమర్రాజు సహచరుడు; కావలి బొర్రయ్య తొలి చరిత్రకారుడిగా పేర్కొనబడ్డారు.