By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Telugu, Question 91

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనలో బాలుడిగా పాలుపంచుకున్న ఆదిరాజు వీరభద్రరావు (1892-1973) తెలంగాణ చరిత్రపై అనేక పుస్తకాల్ని వెలువరించాడు. ఈయన 1903 లో నన్నయ రాసిన శకుంతలోపాఖ్యానమును ‘చిత్రశాకున్తలమ్’ పేరిట 300 పుటల్లో నవలీకరించడానికి సిద్ధపడ్డాడు. అయితే కేవలం 100 పేజీలు మాత్రమే నవలీకరించి పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నాడని బొడ్డపాటి వేంకటకుటుంబరావు తన ఆంధ్ర నవలా పరిణామము అనే పుస్తకం (పే. 118) లో పేర్కొన్నాడు.
1906లో హైదరాబాద్‌లో స్థాపించబడి, 1910 నాటికి మద్రాసుకు తరలించబడ్డ ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ తరపున తొలి దశలో అనేక నవలలు వెలువడ్డాయి. ఈ మండలి తరపున భోగరాజు నారాయణమూర్తి – విమలాదేవి, వేలాల సుబ్బారావు – రాణిసంయుక్త, కేతవరపు – రాయచూరు యుద్ధము తదితర రచనలు వెలువడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన మెడోస్ టేలర్ ఆంగ్లంలో రాసిన ‘చాంద్ బిబి’ నవలను చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘హేమలత’ పేరిట అనుసృజన చేసిండు. రాణీ సంయుక్త నవలను కొమర్రాజు వెంకటలక్ష్మణరావు తాను సంపాదకుడిగా ఉన్న విజ్ఞాన చంద్రికా గ్రంథమాల తరపున 14 మార్చి, 1908 నాడు ప్రకటించాడు. అంతకుముందు కొమర్రాజు తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనతో 1901లోనే పునాది వేసిండు. ఇందులో అప్ఘనుల భారతదేశ దండయాత్ర కథా వస్తువు. పృథ్వీరాజు కాలములో జరిగిన దండయాత్రలో భారతదేశం స్వాతంత్ర్యం కోల్పోయిన తీరును, పృథ్వీరాజు భార్య రాణీ సంయుక్త స్వదేశాభిమానము ఇందులో చిత్రీకరించడమయినది.
1910లో కొమర్రాజు లక్ష్మణరావు రాసిన కథ ‘ఫూల్ జానీబేగమ్’ దీన్ని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పెంచి నవలగా 1914 లో ప్రచురించాడు. ఈ నవల పేరు ‘మిథునానురాగము’.
తెలంగాణ నుంచి మొదటి స్వతంత్ర పత్రిక హితబోధిని (1913-1915) వెలువరించిన బడారు శ్రీనివాసరావు 1910లోనే ‘ఆశాదోషం’ అనే నవలను రాసిండు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ దుర్గానికి సంబంధించిన ఈ చారిత్రక నవల రాత ప్రతి అందుబాటులో ఉంది. శ్రీనివాసరావు ఆశాదోషం నవలతో పాటు కథలు, నాటికలు, కవిత్వం కూడా వెలువరించాడు. ఆయుర్వేద వైద్యుడు, నటుడు కూడా అయిన శ్రీనివాసరావు తాను పుట్టి పెరిగిన ఊరు కోయిల్‌కొండకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని ఆధునిక నవలగా మలిచిండు. 16 వ శతాబ్దానికి చెందిన చారిత్రక నేపథ్యంలో రాసిన నవలలో ముస్లిము రాజుల దాడిలో కోయిల్‌కొండ దుర్గం నాశనం కావడం, అక్కడి పాలకవంశం అంతరించి పోవడం కథాంశంగా చిత్రీకరించబడింది. సరళ గ్రాంథిక భాషలో రచన సాగింది.
ఈ చాప్టర్‌లో 1911-1930 సంవత్సరాల మధ్యన వెలువడ్డ నవలా సాహిత్యాన్ని విశ్లేషించడమైంది. దాదాపు ఇదే కాలంలో ఆంధ్రప్రాంతంలో చిలకమర్తి, వేంకట పార్వతీశ కవులు, విశ్వనాథ, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ, తల్లాప్రగడ సూర్యనారాయణ, వేలూరి శివరామశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి తదితరులు తెలుగు నవలను నడిపించారు. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు, శేషభట్టార్ తదితరులు తెలంగాణలో నవలా రచనకు పూనుకుండ్రు. 1911 లో ఉస్మానలీఖాన్ పాలనతో హైదరాబాద్ రాజ్యంలో ఆధునీకీకరణకు పునాదులు పడ్డాయి. 1930 వరకు అని చెప్పడంలో జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభతో తెలంగాణ రాజకీయాలు, చైతన్యం ఒక నిర్దిష్ట రూపంలో మొదలయ్యాయి. ఈ రెండు కీలక సంఘటనలు, అవి తెలంగాణ సమాజంపై ప్రగాఢమైన ప్రభావం చూపించాయి కాబట్టి ఈ సంవత్సరాల మధ్యకాలంలో వెలువడిన నవలలను ఇక్కడ చర్చించడమైనది. ఈ కాలంలోనే తెలంగాణాలో ఒక వైపు గ్రంథాలయోద్యమం, మరోవైపు పత్రికోద్యమం, ఒక దానికొకటి పూరకంగా, ప్రేరకంగా పనిచేసి మొత్తం మీద హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రజల అభ్యున్నతికి కృషి చేశాయి. వీటికి అనేక మంది వైతాళికులు, సంస్థలు, సంఘాలు, ప్రచురణ సంస్థలు, గ్రంథమాలలు, బుక్‌షాప్స్ కృషి చేశాయి.
1911 లో తెలంగాణలో మీర్‌మహబూబ్ అలీఖాన్ మరణానంతరం ఆయన కొడుకు మీర్ ఉస్మానలీఖాన్ పాలన ప్రారంభమయింది. ఈయన పాలనలో ఉస్మానియా వర్సిటీ, హాస్పిటల్స్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలే గాకుండా నిజాంసాగర్, తుంగభద్ర లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈయన పాలనలో ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై ఆంక్షలు విధించడంతో నిరసన వెల్లువెత్తింది. ఈ నిరసనను గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వ్యక్తం చేశారు. గ్రంథమాలలు వెలుగు చూశాయి. నవలల్ని ప్రచురించాయి. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ఒద్దిరాజు సోదరులు, మందుముల సోదరులు, షబ్నవీసు వెంకటరామనరసింహారావు లాంటి వాళ్లు ఈ కాలంలోనే రంగం మీదికి వచ్చారు. గ్రంథాలయ, పత్రిక, సాహిత్య, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటి నేపథ్యంతో, స్ఫూర్తితో వెలువడిన నవలలను ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ విభాగంలో 1911-1930 ల మధ్యన వెలువడ్డ నవలల గురించి చర్చిద్దాం. రాజకీయ చైతన్యంతో రాసిన నవలలు ఈ కాలంలోనే వెలువడ్డాయి. మనమూ చరిత్రకు ఎక్కదగినవారమే! మన జీవితాలు నవలకు అనువైనవే అని భావించి నవలలు రాసిండ్రు. ఈ నవలల్లో ఎక్కువభాగం చారిత్రక స్పృహతో రాసినవే. సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు, శేషాద్రి రమణకవులు, శేషభట్టర్ వేంకటరామానుజాచార్యులు తదితరులు తమ ప్రతిభను ప్రదర్శించారు. నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర జనసంఘం కార్యకలాపాలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయి. లైబ్రరీలు ప్రజల కూడలి ప్రదేశంగా మారాయి. రాజకీయాలు మాట్లాడుకోవడమే గాకుండా సాహిత్య సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇవి దోహదం చేశాయి. వీటి ప్రేరణతో సాహిత్యం వెలువడింది. ఇందులో నవలలు కూడా ఉన్నాయి. సంఘ సంస్కరణోద్యమంతో టేకుమళ్ళ నరసింహం ‘రాధమ్మ’ అనే నవలలో ఒక వేశ్య వ్యథాభరిత జీవితాన్ని కళ్లకు కట్టిండు.

Q91

టేకుమళ్ల నరసింహం రాసిన నవల ఏది ?

  1. (1) విమలాదేవి
  2. (2) హేమలత
  3. (3) ఫూల్ జానీబేగం
  4. (4) రాధమ్మCorrect answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) రాధమ్మ

  1. వ్యాసభాగం చివరి వాక్యంలో టేకుమళ్ళ నరసింహం 'రాధమ్మ' అనే నవల రాశాడని ఉంది.
  2. సంఘ సంస్కరణోద్యమ ప్రభావంతో రాసిన ఆ నవల ఒక వేశ్య బాధామయ జీవితాన్ని చిత్రించింది.
  3. విమలాదేవి భోగరాజు నారాయణమూర్తిది, హేమలత చిలకమర్తిది, ఫూల్ జానీబేగం కొమర్రాజు రాసిన కథ.

జాగ్రత్త: ప్రశ్నలో 'టేకుమళ్ల', వ్యాసంలో 'టేకుమళ్ళ' అని ఉంది; రాతలో తేడా మాత్రమే, వ్యక్తి ఒక్కరే.