By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Telugu, Question 135

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
హైదరాబాద్‌లో కుందుర్తి ఆంజనేయులు గారు (1922-1982) వచన కవిత్వంపై అభిమానంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ అని ఒక సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ వారు 1967 నుంచి ఇప్పటి వరకు – పద్దెనిమిది మంది వచన కవిత్వ పుస్తకాలకు బహుమతులిచ్చారు. వేగుంట మోహన్ ప్రసాద్, నగ్నముని, చెరబండరాజు, శివారెడ్డి, రేవతీదేవి వంటి కవులకు పూర్వం బహుమతులు లభించాయి.
ఫ్రీవర్స్ ఫ్రంట్ వారు ఈ సారి 1988 సంవత్సరపు అవార్డు కొండేపూడి నిర్మల రచించిన ‘సందిగ్ధ సంధ్య’ అనే కవితా సంపుటికి ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఈమె ఆధికారికంగా మంచి కవిత్వం రాసి మన్ననలు పొందింది. ఆమె కవితల్ని ఈ శీర్షికలో అప్పుడప్పుడు పరామర్శించాను. ఈ శీర్షికలో పరామర్శించబడ్డ కవులు తరువాత ఇంకా మంచి కవిత్వం రాసి, తగిన గుర్తింపు పొంది, అవార్డులు కూడా అందుకోటం చేరాతలకు సంతోష కారణమే. ఈ అవార్డు ప్రదానం కుందుర్తి జయంతి (జననం : 1922 డిసెంబర్ 16) సందర్భంగా జరుగుతుంది. ఈ సారి ఈ ప్రదానం డిసెంబరు 17న జరిగింది.
సత్యమూర్తి (కుందుర్తి గారబ్బాయి) కుందుర్తి చనిపోయిన (1982 అక్టోబరు 25) తరువాత ప్రతి సంవత్సరమూ అచ్చుకాకుండా మిగిలిపోయిన ఆయన రచనలు అచ్చేయించి అవార్డు ప్రదానంతో పాటు ఆవిష్కరింపజేస్తుంటారు. హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్తా ఎగిరిపోయాక, మేఘామాల, ఇది నా జెండా అనే కావ్యాలు కుందుర్తిగారు పోయిన తరువాతే వచ్చాయి. కుందుర్తి గారి అసంపూర్ణ ఆత్మకథ ‘బతుకుమాట’ పేరుతో ఈ సారి వచ్చింది.
అసలు ఆత్మకథలన్నీ అసంపూర్ణంగానే ఉంటాయి. అందుకు ప్రధానంగా మూడు కారణాలు. ఒకటి జీవితానికి ముగింపు ఎప్పుడొస్తుందో తెలీదు. రెండు, జీవిత చరిత్రలు సాధారణంగా నడి వయస్సు దాటిన తరువాతనే రాస్తుంటారు కాబట్టి గ్రంథస్థ విషయాల ప్రాధాన్యం, వాస్తవికత, వారి జ్ఞాపకాల పరిమితికి లోబడి ఉంటుంది. మూడు, ఎంతటి నిజాయితీ పరుడికైనా మరొకరితో పంచుకోలేని అనుభవాలు ఉండొచ్చు. ఆ Private Corner ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు.
కుందుర్తి గారికి ఆత్మకథ రాయాలన్న కోరిక అసలు లేదు. కవి శివారెడ్డి ‘గురువు గారూ, మీ అనుభవాలు రాయగూడదూ’ అని ఒకటి రెండు సార్లు అడిగి ప్రేరేపించాడు. (ఈ ‘గురువు గారూ’ అనే ప్రయోగం మీద కొంత ఆసక్తికరమైన చర్చ చేశారు ఈ పుస్తకంలో).
అంతే కాదు, కుందుర్తిగారు మధ్యమధ్యలో పాఠకులతో వాదనకు దిగుతారు. అది ఆయన ఎక్కడ అలవర్చుకున్నారో గాని దానివల్ల మొదటి పేజీల్లో ఏదో హాస్యరచన చేస్తున్నట్టు రాశారు. అసలు సమస్య ఏమిటంటే మిత్రులు రాయమంటున్నారు. తనకి రాయాలని లేదు. బలవంతపు బ్రాహ్మణార్థంగా రాశారు. చివర ఇచ్చిన డైరీల నోట్సుతో తారీకులు కనిపిస్తాయి గాని, ఇంకెక్కడా తారీకులియ్యలేదు. ఒక్కచోట తప్ప సంవత్సరాలు కూడా ఇయ్యలేదు. 1939లో బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో (ఇక్కడే ఆయనకు విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యరికం అబ్బింది) చదువుకుంటున్నప్పుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు గార్ల పరిచయం ప్లస్ కమ్యూనిస్టు సాహిత్య పరిచయం ఏర్పడిందనీ, ఆ తరువాత కూడా కొంత కాలం జాతీయవాదిగానే ఉండేవాణ్ణి అనీ రాశారు. కుందుర్తి జీవితాన్నీ కవితా జీవితాన్నీ పరిశీలించిన వారికి కుందుర్తి ఎప్పుడూ జాతీయ వాదిగానే ఉన్నట్టు కనిపిస్తాడు. అంతర్జాతీయత ఆయన ఒంటికి అంత పట్టినట్టు లేదు. అందుకే సుప్రసన్న తన దృక్పథానికి అనుకూలంగా కుందుర్తిని వ్యాఖ్యానించగలిగాడు. 1962లో చైనాను శపిస్తూ కోరస్ రచనలు చేసిన కవుల జాబితాలో కుందుర్తి గారు కూడా ఉన్నారు.
కుందుర్తి ఆత్మకథ విస్తృతి చాలా చిన్నదైనా కొన్ని విలువైన విషయాలున్నై. ముఖ్యంగా అభ్యుదయోద్యమంలో కృషి చేసిన కొందరి గురించి ఈ పుస్తకంలో దొరుకుతుంది. పోలూరి ఆంజనేయ ప్రసాద్, దేశిరాజు కృష్ణశర్మ అంటే ఎవరా అని చాలా రోజులు మధన పడేవాణ్ణీ. ఇప్పుడు వాళ్ల గురించి కొంత తెలుసుకోవచ్చు. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, సి.వి. కృష్ణారావు గార్ల వంటి అభ్యుదయ కవులతో కుందుర్తిగారి సాన్నిహిత్యం, వారు కలిసి కృషి చేసిన తీరు ఈ పుస్తకంలో దొరుకుతుంది.
నర్సరావుపేటలో కుందుర్తి ఆంజనేయులు గారూ, ఆయన మిత్రులూ కలిసి నవ్యకళా పరిషత్ అని ఒకటి ఏర్పరచటానికీ, దానికి కావల్సిన డబ్బు సమకూర్చటానికీ, మీటింగ్ పెట్టి వక్తలను పిలిపించటానికీ ఎన్నెన్ని అవస్థలుపడ్డారో చాలా వివరంగా వర్ణించారు. నిజానికి ఇదొక్కటే మనకు వివరంగా కనిపించేది. అసలు ఈ ఒక్కదాన్ని గురించి తెలుసుకోటానికైనా ఈ పుస్తకం కొని చదవదగింది. దాని ప్రముఖ్యం ఏమిటో కుందుర్తి గారి మాటల్లోనే చూడండి.
‘ఆ విధంగా నర్సరావుపేటలో నవ్యకళా పరిషత్ వేదికమీద శ్రీశ్రీ ప్రారంభించిన సాహిత్య విప్లవంలో రెండో దశ ప్రారంభమైంది. సాహిత్య రంగంలో అభ్యుదయ కవితా విప్లవం సర్వవ్యాప్తం కావడానికి అవసరమైన తొలి బీజాలు పడ్డాయి’ (పేజీ 89) ఇంత ముఖ్యమైన సంఘటనకు తారీకు కాదు గదా సంవత్సరం కూడా దొరకదు. ఆ సభ గురించి కోలవెన్నురామకోటేశ్వరరావుగారు త్రివేణిలో సంపాదకీయం కూడా రాశారట! దాని వివరాలూ తెలీదు. తరువాత 1944లో అచ్చయిన నయాగరా అనే కవితా సంపుటిలో చేరిన కొన్ని పద్యాలు ఈ వేదికమీద చదివినట్టు కుందుర్తి గారు రాశారు. అవి కుందుర్తి ‘జయిస్తుంది’, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ‘ప్రజాశక్తి’ అనేవి. ఇవి 1941 అక్టోబరులో రాసినట్లు ‘నయాగరా’లో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ కళాపరిషత్ సభ 1941 అక్టోబరుకు కొన్ని నెలల ముందు జరిగినట్టు ఊహించవచ్చు. ఎంత ముందో చెప్పలేమనుకోండి. త్రివేణి పత్రిక సంపుటాలు తిరగేస్తే ఈ సభ వివరాలు దొరుకుతాయనుకుంటాను. అభ్యుదయ సాహిత్య ప్రారంభ వికాసాలను పరిశోధించదల్చుకున్న వారు ఈ పనిచేస్తారని ఆశిస్తాను.

Q135

సందిగ్ధ సంధ్య ఎవరి రచన ?

  1. (1) నగ్నముని
  2. (2) చెరబండరాజు
  3. (3) కొండేపూడి నిర్మలCorrect answer
  4. (4) వేగుంట మోహన్ ప్రసాద్

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) కొండేపూడి నిర్మల

  1. ‘సందిగ్ధ సంధ్య’ అనే కవితా సంపుటి కొండేపూడి నిర్మల రచన అనీ, దానికే 1988 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చిందనీ వ్యాసం చెబుతుంది.
  2. నగ్నముని, చెరబండరాజు, వేగుంట మోహన్ ప్రసాద్ అంతకు ముందే ఈ అవార్డు పొందిన కవులు; వారి పుస్తకాల పేర్లు వ్యాసంలో లేవు.

జాగ్రత్త: అవార్డు పొందిన కవుల జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఈ పుస్తకం వారిది కాదు.