By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Telugu, Question 123

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆంధ్రదేశ చరిత్రలో బృహత్ శిలాయుగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఎందుకంటే క్రీ.పూ. 800ల ప్రాంతంలో ముడి ఇనుప ఖనిజాన్ని కరిగించి, ఇనుప పనిముట్ల తయారీ ప్రారంభమై జీవన విధానంలో పెనుమార్పుకు దారి తీసింది. చనిపోయిన వారిని భూమిలో పాతిపెట్టి, గుంటను పూడ్చి చుట్టూ పెద్ద పెద్ద గుండురాళ్ళను గుండ్రంగా నాటడంవల్ల ఈ యుగాన్ని బృహత్ శిలాయుగమని, అలాగే ఇనుము వాడకంలోకి రావడంవల్ల ఇనుపయుగమని పిలుస్తారు. మరణించిన వారికి సమాధులు కట్టే ఆచారమున్న ఆనాటి ప్రజలు, సమాధుల ముందు చనిపోయినవారి ఆకారాలను రాతిలో చెక్కి పాతి పెట్టారు. వరంగల్ జిల్లా కాటారం, ఖమ్మం జిల్లా గలభ గూడెం వద్ద క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన శిలువాకారపు శిల్పాలను ఇటీవల కనుక్కోవడం జరిగింది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని చిన్న మారూరు వద్ద ఒక సమాధిరాతిపై చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టే ముందు తాళ్ళతో కట్టినట్లున్న బొమ్మను చెక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది క్రీ.పూ. 8-5 శతాబ్దాల నాటి బొమ్మ. ఇలా ప్రారంభమైన స్మారక శిల్పం, చారిత్రక తొలి యుగంలో బౌద్ధ గాథా శిల్పాలను చెక్కడానికి దోహదం చేసింది.
శిల్పులు కేవలం రాళ్ళమీదే కాక, మట్టి కొయ్య, లోహం, సున్నం మొదలైన ధాతువులతో అపురూపమైన కళాఖండాల్ని సృష్టించి ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతులను అధ్యయనం చేయడానికి ఆధారాల నందించి ఎంతో సేవ చేశారు. శిల్పులు శాసనాలను చెక్కిన శాసన శిల్పులు, బొమ్మలు చెక్కిన లోహశిల్పులు, కొయ్యతో రథాలు, మొదలైన వాటిని తీర్చిదిద్దిన దారు శిల్పులు, సున్నంతో బొమ్మలు చేసిన సుధా శిల్పులుగా శిలా, తామ్ర శాసనాల్లో పేర్కొనబడ్డారు. అంతేకాదు, శిల్పులు సంఘాలుగా ఏర్పడి, వివిధ హోదాలు పొంది సమాజంలో గౌరవాన్నిదక్కించుకొన్నారు. రాజులు, రాణుల కోరిక ప్రకారం ఆలయాలను నిర్మించి, శిల్పాలను చెక్కినాటి సంస్కృతికి అద్దం పట్టి చూపిన శిల్పులు కూడా తమకంటూ ఒక చరిత్రను, సంస్కృతుల్లో ఒక భాగంగా మిగిలిపోయారు. ప్రతిభను కనబరిచి, ఎన్నో బిరుదులు కూడా పొందిన తెలుగు శిల్పులు తమ కులాన్ని, గోత్రాలనూ, వారు ఆరాధించిన దేవతలనూ చెల్లించిన పన్నులు, పన్నులు ఎక్కువని పించినపుడు తిరగబడిన తీరు, పనులు కొరవడినపుడూ, ఇతరుల ఆహ్వానం మీద దూర ప్రాంతాలకు వలసలు పోయిన వైనాలు శాసనాల్లో ఉన్నాయి.
శాసన లేఖకులు :
సింధు నాగరికతలో దొరికిన ముద్రికలపైగల లిపిని మినహా ఇస్తే క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోకుడు వేయించిన రాతి శాసనాలే మనదేశపు తొలి శాసనాలు. మన రాష్ట్రంలో అమరావతి, ఎర్రగుడి, రాజుల మందగిరివద్ద అశోకుని శాసనాలున్న సంగతి తెలిసిందే, శాసనాలు చెక్కేవాళ్ళను శాసన లిపికారులనీ, రాజశాసనాలను చెక్కిన వారిని రాజ లిపికారులని, రాజలేఖకులని పిలిచేవాళ్ళు. క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఒక అమరావతీ బ్రాహ్మ శాసనంలో రాజలేఖకుడైన బాలకుని ప్రస్తావన ఉంది. అలాగే గుంటుపల్లి గుహాలయాల వద్ద గల క్రీ.పూ. 1 వ శతాబ్దికి చెందిన శాసనంలో చుల్లగోమకుడనే మరో శాసన లేఖకుని పేరుంది. అటు తరువాత క్రీస్తు శకం 8-9 శతాబ్దాల దాకా, శాసన శిల్పుల పేర్లు శాసనాల్లో కనిపించకపోవటం గమనించాల్సిన విషయం.
విజయవాడ ఇంద్రకీలాద్రి శాసనాన్ని క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాచార్యుడనే శాసనశిల్పి చెక్కాడు. క్రీ.శ. 1076 నాటి చేబ్రోలు శాసనాన్ని గుండోజు, క్రీ.శ. 1097 నాటి వొల్లాల శాసనాన్ని సూత్రధారి జువ్వపాచార్యుడు అనే శిల్పులు మలిచారు. రాజశాసనాలను భద్రపరిచే వారిని అక్షపటలికులనీ, అక్షశాలినులని పిలిచేవారు. క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిన కొర్ని, చిన్న బాదాంరాగిరేకు శాసనాన్ని వంశపరంపర శాసనలేఖకులైన మహాక్ష శాలివల్ల మోజు, అతని కొడుకు మాంకన చెక్కారు. నన్నయ రాసిన నందంపూడి శాసనాన్ని గుండాచార్యుడనే ఆస్థాన శిల్పి చెక్కాడు. “ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుని కుక్కునూరు రాగిరేకు శాసనాలను బేతాచారి అనే శాసనశిల్పి మలిచినట్లు క్రీ.శ. 13వ శతాబ్ది శాసనం తెలియజేస్తుంది”. అటు తరువాత బయల్పడిన నారాయణపురం, ముఖలింగం, అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, చాళుక్య భీమవరం, తిరుపతి, శ్రీకూర్మం మొదలైన చోట్ల గల శాసనాలు, పైదేవాలయాల్లో పారంపర్య హక్కుగల శాసన శిల్పులు ఉండేవారని తెలియజేస్తున్నాము. వరుసగా నారాయణపురంలో ప్రోలాచారి, ముఖలింగంలో లోకాచారి, అమరావతిలో నలపాచార్య, పాల కొల్లులో సరణోజు, రామాచారి, సర్పవరంలో కూనాచారి, ద్రాక్షా రామంలో డాకరేమి సూరాచారి, పెద్దనాచార్య, బేతనాచార్య, వీవరాజేంద్రచోడాచార్య, చాళుక్య భీమవరంలో నాగోజు, శ్రీశైలాచారి, శ్రీకూర్మంలో శంకరుడనే శాసన శిల్పులు ఉద్యోగులుగా చలామణి అయినారు. చివరగా పేర్కొన్న శ్రీకూర్మంలోని వాంకలపూడి శంకరుడనే శిల్పి చక్కటి కవిత్వాన్ని చెప్పి, పద్యాలు కూడా రాయగల లిపికారుడని అక్కడి శాసనం చెబుతుంది. కేవలం శిలా శిల్పులే కాక, ఇతర ధాతువులపై బొమ్మలు చేయగల శిల్పులు కూడా శాసనాలు చెక్కిన ఆధారాలు ఉన్నాయి. క్రీ.శ. 1504 నాటి చాంగాడు రాగిరేకుల్ని ఆ గ్రామంలోని దారుశిల్పి మల్లనాచార్యుడు క్రీ.శ. 1518 నాటి కోకటం శాసనాన్ని అగసాల (బంగారుపని చేసే) బైరోజు క్రీ.శ. 1545 నాటి వేల్పుచర్ల శాసనాన్ని వడ్ల కాణాచికాండు తిన్నోజు మలిచినట్లు నాటి ఆయా శాసనాలు తెలియజేస్తున్నాయి.
రాతిపై బొమ్మను చెక్కేవాళ్ళను శిలా శిల్పులనీ కొండలు, బండలనుంచి రాతిని వేరుచేసే వాళ్ళను పాషా(సా)ణికులనే వాళ్ళు. అమరావతిలోని క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఒక శాసనంలో పాసానికుని ప్రస్తావన ఉంది. ప్రాచీనాంధ్ర శాసనాల్లో శిలా శిల్పులలోని వివిధ వర్గాలను తెలిపే అనేక ఆధారాలున్నాయి. కొంత మంది పాసాని కుల పనులను పర్యవేక్షించే శిల్పుల్ని ఆవేశనులంటారు. బౌద్ధస్థావరమైన జగ్గయ్యపేట శాసనంలో సిద్ధార్థ, నాగచంద్ర అనే ఆవేశనుల గురించి ఉంది. స్ఫటికం, రత్నం, వజ్రం మొదలైన వాటిపై పనిచేసే వారిని మణికారులంటారు. అమరావతి, భట్టిప్రోలులో లభించిన స్ఫటిక బౌద్ధధాతు పేటికలను క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన మణికారులు చేశారు. రాళ్ళను కట్టడాలకు అనువుగా మలిచే వాళ్ళను శిలావద్దకు లనేవాళ్ళు. బొమ్మలను చెక్కేవాళ్ళను శిలాకమ్మికులనీ, వీరి పర్యవేక్షకుల్ని శిలా కమ్మాంతికులనీ, అలాగే కట్టడాల మరమ్మతులు చేసేవారిని నవ కమ్మికులనీ, వీరి పర్యవేక్షకుల్ని మహానవ కమ్మికులనీ, నవకమ్మిక ప్రధానులనీ శాసనాలు పేర్కొంటున్నాయి. అమరావతి బౌద్ధ స్తూప, విహారాల మరమ్మతులను చేపట్టిన బౌద్ధ, రక్షిత అనే నవ కమ్మికుడు, ఆదిత్య ధమ్మ రక్షితులనే మహాసవ కమ్మికలు, చంద అనే ప్రధాన నవకమ్మికుల వివరాలను క్రీ.శ. 1-2 శతాబ్దాల నాటి అమరావతి శాసనాలు వెల్లడిస్తున్నాయి. నాగార్జునకొండలోని బౌద్ధకట్టడాల నిర్మాణ, జీర్ణోద్ధరణ పనులు ఆనంద, చందముఖి, ధమ్మనంది, విధికులనే నవ కమ్మిక, శిలావద్దకుల పర్యవేక్షణలో జరిగాయి.
హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్ట వద్ద క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన ‘తొలచువాన్లు’ అనే శాసనం రాతి శిల్పులను సూచిస్తుంది. ప్రకాశం జిల్లా భైరవకొండ గుహాలయాలను తొలచిన శిల్పుల్లో వేలుగుంట ఆచార్లు కుఱవది ఆచార్లుగా అక్కడున్న క్రీ.శ. 7వ శతాబ్దపు శాసనాలు తెలియజేస్తున్నాయి.
రాతిపై పనిచేసే శిల్పులను కాసెవారనీ, కాశాచార్లనీ శాసనాలు పేర్కొంటున్నాయి. క్రీ.శ. 9వ శతాబ్దపు సంగమేశ్వరం శాసనంలో యాగోజు కాశాచారి, క్రీ.శ. 12వ శతాబ్దపు వలివేరు శాసనంలో కాసె.... మోజుల ప్రస్తావన వుంది. వాస్తు, శిల్ప శాస్త్రాలలో ప్రావీణ్య ముండి చేతిలో సూత్రం (దారం) ధరించే ఆలయ నిర్మాణం పర్యవేక్షకుల్ని సూత్రధారులంటారు. క్రీ.శ. 1097-1202 సం॥ల మధ్యకాలపు వొల్లాలి, మాచర్ల, పానగల్లు, ముక్కామల, జలాల్‌పురం శాసనాల్లో వరుసగా జువ్వపాచార్య, నాగాచార్య, తిప్పోజు, బమ్మోజు, బొమ్మలయ్య, కాసెమల్లోజులనే సూత్రధారుల గురించి చెప్పబడింది. ఈ సూత్రధారులు తమ అదుపు ఆజ్ఞలకు లోబడి పనిచేసే తక్షకి, వర్ధకుల పనులను పర్యవేక్షిస్తూ, స్థపతుల ఆదేశాలను అమలు చేస్తుండేవాళ్ళు.

Q123

కీసరగుట్ట శాసనం ఏ శతాబ్దిది ?

  1. (1) క్రీ.శ. 1504
  2. (2) క్రీ.శ. 1518
  3. (3) క్రీ.శ. 1545
  4. (4) క్రీ.శ. 4వ శతాబ్దిCorrect answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) క్రీ.శ. 4వ శతాబ్ది

  1. హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్ట వద్ద ఉన్న ‘తొలచువాన్లు’ అనే శాసనం క్రీ.శ. 4వ శతాబ్దికి చెందినదని వ్యాసంలో ఉంది.
  2. మిగిలిన మూడు ఐచ్ఛికాలు శతాబ్దాలు కావు, సంవత్సరాలు: 1504 చాంగాడు రాగిరేకులు, 1518 కోకటం శాసనం, 1545 వేల్పుచర్ల శాసనం.
  3. ప్రశ్న ‘ఏ శతాబ్ది’ అని అడిగింది కాబట్టి (4) ఒక్కటే సరిపోతుంది.