మరాఠాలను ఓడించినవారు :
- (1) క్లైవ్
- (2) మోనసర్ రేమండ్
- (3) సింధియా
- (4) వెల్లస్లీ
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నిజాం టిప్పు సుల్తాన్‌తో చేతులు కలుపుతాడేమోనని ఇంగ్లీషు వారు భయపడ్డారు. ఎందుకంటే 1795లో మరాఠాలు హైదరాబాద్ మీద దాడి చేసి, విపరీతమైన నష్టాన్ని కలిగించి కొంత భూభాగాన్ని ఆక్రమించినప్పుడు గత ఒడంబడిక ప్రకారం సహాయం చేయవలసిన ఇంగ్లీషు వారు మాట తప్పారు. అందువల్ల ఫ్రెంచి సైనిక నిపుణుడు మోనసేర్ రేమండ్ శిక్షణలో రూపుదిద్దుకుంటున్న తన సొంత బలగం మీదనే నిజాం ఆధారపడడం ప్రారంభించాడు. (ఈ మోనసేర్ రేమండ్ పేరుతో హైదరాబాద్‌లో మూసారాం బాగ్ ఏర్పడింది. అక్కడే అతని సమాధి ఉన్నది) అయితే, 1798లో రేమండ్ అకస్మాత్తుగా మరణించడంతో తిరిగి నిజాం ఇంగ్లీషు వారి మీద ఆధారపడవలసి వచ్చింది. ఫ్రెంచి సైనిక శిక్షిత సైన్యాన్ని రద్దు చేస్తేనే మరాఠాల దాడి నుంచి రక్షణ కల్పిస్తామని అప్పుడు వారు నిజాంకు చెప్పారు. టిప్పు సుల్తాన్‌తో జరిగిన ఆఖరి యుద్ధంలో అతను మరణించిన తరువాత ఆక్రమించుకున్న భూభాగాలలో 1799 నాటి మైసూరు ఒడంబడిక ప్రకారం నిజాంకు ఎక్కువ వాటా వచ్చింది. 1800 సంవత్సరంలో నిజాంకూ, బ్రిటిష్ వారికీ కొత్తగా మరో ఒడంబడిక కుదిరింది. దీని ప్రకారం అనుబంధ సైనిక బలగాన్ని పెంచుతారు. వాటి నిర్వహణకు గాను 1792, 1799 ఒప్పందాల ప్రకారం పొందిన టిప్పుసుల్తాన్ రాజ్యభాగాలను నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వాలి. అంతేకాదు, యుద్ధ అవసరం వచ్చినప్పుడు నిజాం తన సైన్యం మొత్తాన్ని, (వ్యక్తిగత అవసరాలకు మినహాయించుకొని మిగితాది) బ్రిటిష్ వారి కోసం కేటాయించాలి. అలా 1800 నాటి ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి హస్తగతమైంది. హైదరాబాద్ రాజ్యం సరిహద్దులు దాదాపుగా స్థిరపడిపోయాయి. 1850 తరువాత బీరారు ప్రాంతాన్ని, రాయచూర్ దో ఆబ్ జిల్లాలను నిజాం నుంచి తీసుకున్నారు కానీ, 1857 తిరుగుబాటు తరువాత రాయచూర్‌ను తిరిగి ఇచ్చేశారు. బీరారు గురించి నిజాంలు పదేపదే పోరుపెట్టగా, 20వ శతాబ్దంలో దాన్ని నామమాత్రంగా నిజాం ప్రాంతాలలో ఒకటిగా గుర్తిస్తూ, కొంత వార్షిక పరిహారాన్ని చెల్లించనారంభించారు.
1757లో ప్లాసీ యుద్ధం వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల భారత జైత్రయాత్రలో మొదటి దశగా చెప్పవచ్చు. 1765లో క్లైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఢిల్లీ చక్రవర్తి నుంచి బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు ‘దివానీ’ అధికారాలను సంపాదించాడు. స్వదేశ రాజులకూ, బ్రిటిష్ వారికీ మధ్య సంబంధాలను చర్చిస్తూ వింజమూరి గోవిందరాజులు అనే రచయిత 1918లో ఇలా రాశారు. “...ఇంగ్లీషు వారీ దేశమున ప్రవేశించినది మొదలు పదునెనిమిదవ శతాబ్ద మధ్యభాగము వరకును జరిగిన కాలమును, వారికిని, స్వదేశ రాజులకును గలిగిన సంబంధముల నాలోచించునపుడు, మొదటి దశ క్రింద మనము పరిగణింపవచ్చును. ఈ యుగమారంభమున ఇంగ్లీషువారు వర్తకులుగా నున్నను, యుగాంతమగు సరికి ఇతర రాజులతో పాటు రాజులై హిందూ దేశమునందలి కొన్ని భాగములను పరిపాలన చేయుచుండిరి.....స్వదేశ రాజులకును ఇంగ్లీషు వారికిని ఏయే కాలములందెట్టి సంబంధములుండెడివో యాలోచించునప్పుడు, 1798 నుంచి 1805 వరకు నుండిన వెల్లస్లీ గారి ప్రభుత్వ కాలమును వదిలివేసితిమేని, 1757 నుంచి 1813 వరకును గల కాలము రెండవ దశగా కావచ్చును. ఈ కాలమునందింగ్లీషు వారు తామిదివర కార్జించిన రాజ్యముతో సంతుష్టులై, తమ ప్రక్కనున్న దేశము లెంత యల్లకల్లోలముగా నున్నను, ఇతర రాజులు తమ సాహాయ్యమును కోరిననను తమకు సామంత రాజులుగా నుండుట కంగీకరించినను కూడ, వారితో నెట్టి సంపర్కమును కలిగించుకొనమని శపథము పట్టిరి. వెల్లస్లీగారు మాత్రమీ పద్ధతి ప్రకారము నడచుకొనలేదు. వారితర రాజులకు సైన్య సాహాయ్యము నొనరించుట కంగీకరించి వారి వలన దాని కగు కర్చులను పుచ్చుకొనుట కారంభించిరి. ఇది రెండు విధముల ఇంగ్లీషు వారికి లాభకారిగా నుండెను. స్వదేశ రాజుల క్రింద సైన్యము లున్నపుడెల్లను, వారి సైన్యము నెవరి మీద నుపయోగింతురో యను భయముండెను. కాని, ఈ పద్ధతి వలన రాష్ట్రములను కాపాడుకొనుటకు కావలసిన సైన్యమును వారి కొరకు బ్రిటిషు వారే జాగ్రత్త పెట్టుట వలన, అప్పటి నుండియు ఈ భయము లేకుండెను. ఇది మొదటి లాభము. రెండవ లాభము బ్రిటిషు వారి యధికారము క్రిందనున్న సైన్యము హెచ్చుగుటమే. పేరునకు స్వదేశ రాజ్యముల సంరక్షణమునకై యుంచబడిన సైన్యమైనను, బ్రిటిషు వారి యధికారము క్రిందనుండుటచే నీ సైన్యము వారి యుపయోగములకు కూడ పనికివచ్చుచుండెను. కాని, దాని కగు ఖర్చు మాత్రము స్వదేశపు రాజులే భరించుచుండిరి. (స్వదేశ సంస్థానములు, హైందవ రాజ్యాంగ పరిణామము, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1 మే, 1918 : 18)
హైదరాబాద్ చరిత్రకు సంబంధించి 1800 నాటి సైన్య సహాయ సంధి (Treaty of Subsidiary Alliance) చాలా రాజకీయ ప్రాముఖ్యం ఉన్న పత్రం. ఈ పత్రం ద్వారా రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి దత్తం చేయడమే కాకుండా, నిజాం తన స్వతంత్ర ప్రతిపత్తిని చాలా మేరకు కోల్పోయాడు. తమతో తప్ప మరే ఇతర రాజ్యంతోనూ సంబంధాలు కానీ, చర్చలను కానీ జరపకూడదన్న షరతును విధిస్తూ, అందుకు ప్రతిగా హైదరాబాద్ ఆంతరంగిక వ్యవహారాల్లో తమ జోక్యం ఉండదని హామీ ఇస్తున్న 15వ అధికరణం ఒకటి ఉంది.(1956:7). అంతకు ముందే సర్కారు జిల్లాలను కోల్పోయిన నిజాం 1800 తరువాత వాటి మీద రావలసిన కప్పాన్ని కూడా వదులుకోవలసి వచ్చింది.
1803లో మరాఠా యుద్ధం సంభవించింది. పీష్వాలలో ఆఖరివాడైన బాజీరావును తిరిగి బ్రిటిష్ వారు అధికారానికి తెచ్చినందుకు ఆగ్రహించిన సింధియా, హోల్కర్లు యుద్ధానికి దిగారు. యుద్ధం జరుగుతున్న సమయంలోనే సైన్య సహాయ సంధి చేసుకున్న నిజామ్ అలీ ఖాన్ 7 ఆగస్టు 1803లో మరణించాడు. తరువాత అధికారానికి వచ్చిన సికిందర్ జాహ్ బ్రిటిష్ వారికి అంతగా అనుకూలంగా లేడు. మరాఠా యుద్ధంలో తన సొంత సైన్యంతో సహాయపడవలసిన నిజాం ఆ విషయంలో అంతగా సహకరించలేదు. ఆ సమయంలో బ్రిటిష్ వారికి అనుకూలుడయిన మీర్ ఆలం ప్రధానిగా ఉన్నాడు. ఆ తరువాత నుంచి హైదరాబాద్ రాజ్యంలో ప్రధానుల్ని తనకు అనుకూలురను నియమించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒత్తిడి చేసింది. 1850 తరువాత అయితే, బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ప్రధానమంత్రి ఎంపిక జరిగే అవకాశమే లేదు.
జాల్నా వద్ద 1803 సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన ఆస్సే యుద్ధంలో వెల్లస్లీ మరాఠాలను చిత్తుగా ఓడించాడు. బాజీరావును తిరిగి ప్రతిష్టించారు. పీష్వాలకు నైజాంలోని కొన్ని ప్రాంతాలలో చౌత్ వసూలు చేసే అధికారం ఉండేది. అది 1818 వరకు కొనసాగి, 1818లో పీష్వా పతనం తరువాత బ్రిటిష్ వారికి సంక్రమించింది. 1822లో జరిగిన మరో ఒడంబడిక ప్రకారం నిజాంకు చౌత్ నుంచి విముక్తి దొరికింది.
మరాఠాలను ఓడించినవారు :
CBSE answer: (4)
జవాబు: (4) వెల్లస్లీ
జాగ్రత్త: సింధియా మరాఠా పక్షం వాడే, ఓడినవాడు. క్లైవ్ దివానీ అధికారాలు సంపాదించినవాడు. రేమండ్ నిజాం సైన్యానికి శిక్షణ ఇచ్చిన ఫ్రెంచి నిపుణుడు.