By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 2 Telugu, Question 126

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రపంచంలో అనేక దేశాలు ప్రతి ఏటా అంతర్జాతీయ పురస్కారాలను ప్రకటిస్తూనే ఉంటాయి. వీటన్నింటిలోకీ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదీ, ఆర్థికంగా కూడా పరిపుష్టమైందీ నోబెల్ బహుమతి. రాజకీయాలకు, సామాజిక, సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా, ఎంపిక చేసిన కొన్ని రంగాలలో, విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంజనీరు, కెమిస్టు, ‘డైనమెట్’ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్, స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో 1833లో జన్మించాడు. ఆయన పేరు మీద ఏర్పాటైన వార్షిక పురస్కారమే నోబెల్.
ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమ్మాన్యుయెల్ కూడా పేరు మోసిన ఇంజినీరే. పుట్టిన ఎనిమిది మంది సంతానంలో ఆల్ఫ్రెడ్, మరో ముగ్గురు సోదరులు మాత్రమే మిగిలారు. బాల్యంలో ఆల్ఫ్రెడ్ కూడా పలు సార్లు అనారోగ్యంతో బాధపడ్డాడు. శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి ఉన్న ఈ కుర్రాడు తండ్రి వద్దే ఇంజనీరింగ్‌లో తొలి పాఠాలు నేర్చుకున్నాడు, కాని చదువు కొనసాగలేదు. వ్యాపారంలో నష్టం రావటంతో ఇమ్మాన్యుయెల్ 1837లో, కుటుంబాన్ని స్వీడన్‌లోనే వదిలి, సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా) వెళ్లి గనులలో వుపయోగించే పేలుడు పదార్థాలూ, మెషీన్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించాడు. అనతికాలంలో బాగా లాభాలు వచ్చాయి. భార్యాపిల్లల్ని రష్యాకు పిలిపించుకున్నాడు. ప్రైవేటు ట్యూటర్ల వద్ద ఆల్ఫ్రెడ్ విద్యాభ్యాసం కొనసాగింది (ఇది చాలా ఖరీదైన వ్యవహారం!). పదహారు సంవత్సరాలకే మంచి కెమిస్టుగా గుర్తింపు వచ్చింది. ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, రష్యన్‌లలో ప్రావీణ్యం సంపాదించాడు.
1850లో, పారిస్ కెళ్ళి, ఏడాది పాటు కెమిస్ట్రీలో వున్నత విద్యనభ్యసించి, అమెరికాలో నౌకలు నిర్మించే జాన్ ఎరిక్‌సన్ వద్ద నాలుగేళ్లు సహాయకుడిగా పని చేశాడు. ఆ తర్వాత, సెయింట్ పీటర్స్‌బర్గ్ తిరిగివచ్చి, తండ్రి ఫ్యాక్టరీలో, క్రిమియన్ యుద్ధానికి అవసరమైన ఆయుధ సామగ్రి ఉత్పత్తిలో సహాయం చేశాడు. కాని యుద్ధం తర్వాత, ఆయుధాలకు గిరాకీ తగ్గి, ఫ్యాక్టరీ మూతపడింది.
అప్పటికీ, వాడుకలో ఉన్న ఒకే ఒక పేలుడు పదార్థం బ్లాక్ పౌడర్ (ఇది ఒక రకమైన గన్ పౌడర్). సంయోగ క్రియల ద్వారా కొత్త పదార్థాల కోసం ప్రయోగాలు ప్రారంభించాడు ఆల్‌ఫ్రెడ్. నైట్రోగ్లిసరిన్ గురించి తెలుసుగాని దానికి జ్వలనశక్తి చాలా ఎక్కువ. ముట్టుకుంటేనే పేలుతుందని అందరి భయం. సమకాలీన శాస్త్రజ్ఞులు, కెమిస్టులు ఆశ్చర్యపడేలా నైట్రోగ్లిసరిన్ ఉత్పత్తి కోసం ఫ్యాక్టరీ నెలకొల్పాడు ఆల్ఫ్రెడ్. 1863లో తొలి డిటోనేటర్‌ను రూపొందించాడు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆవిష్కర్తగా ఆయనకు పేరు రావటానికి, అపారమైన సంపాదనకూ మూలం యిదే. 1864లో సాంకేతికంగా దీన్ని మరింత మెరుగుపరిచాడు. అయితే, నైట్రోగ్లిసరిన్ విధ్వంసక శక్తి ఈయన్నూ వదిలిపెట్టలేదు. 1865లో ఫ్యాక్టరీ పేలిపోయింది. ఆ ప్రమాదంలో ఒక సోదరుడు మరణించాడు. విస్తృత అధ్యయనం, పలు ప్రయోగాల తర్వాత, అందుబాటులోకి వచ్చిన ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో, కొత్త ‘మోడల్’ను తయారుచేసి ఈ సారి దీనికి ‘డైనమెట్’ అని పేరు కూడ పెట్టాడు. (గ్రీకు భాషలో Dynamics అంటే శక్తి), ఇంగ్లండు, అమెరికాలో దీనికి పేటెంట్లు సంపాదించాడు. సొరంగాలు తవ్వటానికి, కాలువలు తీయటానికి, రైలు మార్గాలు, రోడ్లు నిర్మించటానికి దీన్ని విరివిగా వాడటంతో అనతికాలంలోనే ఆల్ఫ్రెడ్ అపర కుబేరుడయ్యాడు.
1893లో, స్వీడన్‌లోని ఆయుధ పరిశ్రమ పట్ల దృష్టి సారించిన ఆల్ఫ్రెడ్, ‘బోఫోర్స్’లోని ఇనుప కర్మాగారాలను కొనుగోలు చేశాడు. బోఫోర్స్ ఆయుధ కర్మాగారానికి తొలి దశ యిది. పేలుడు పదార్థాలు మాత్రమే గాక, కృత్రిమ సిల్కు, చర్మం వగైరాల గురించి చేసిన ప్రయోగాలలో కూడా విజయం సాధించాడు ఆల్ఫ్రెడ్. మరణించే నాటికి తన పేరు మీద మూడు వందల యాభైకి పైగా పేటెంట్లు రిజిష్టర్ చేయించుకున్నాడు. అవివాహితుడిగానే జీవితం గడిపిన ఆల్ఫ్రెడ్, పలు నాటకాలు, నవలలు, కవితలు కూడా రాశాడుగానీ ప్రచురించలేదు. ఆల్‌ఫ్రెడ్ ఎప్పుడూ ఒకచోట నివసించలేదు. ఐరోపా – అమెరికా ఖండాలలో ఎక్కువగా ప్రయాణాలతోనే కాలం గడిచేది. తనను తాను శాంతికాముకుడిననే భావించాడు ఆల్‌ఫ్రెడ్. తన చివరి వీలునామా మీద నవంబర్ 27, 1895 నాడు పారిస్‌లో సంతకం పెట్టాడు. ఆయన మరణాంతరం (10 డిసెంబర్, 1896) వెలుగులోకొచ్చిన ఆ వీలునామా అందర్నీ కలవరపర్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంచుమించు తన ఆస్తినంతా ఒక బహుమతి ఏర్పాటు చెయ్యటానికే వినియోగించాలన్నది దాని సారాంశం.
అన్ని బహుమతుల్లాగే, నోబెల్ కూడా, వివాదాలకు అతీతమైనదేమీ కాదు. పలుసార్లు, అర్హులకు రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు : సాహిత్యంలో లియో టాల్‌స్టాయ్, ఆంటన్ చెహోవ్, హైన్రిక్ ఇబ్సెన్, థామస్ హార్డీ, జోసెఫ్ కోన్రాడ్, మార్క్‌ట్వేన్, మాక్సింగోర్కీ, జేమ్స్ జాయస్, మార్సెల్ ప్రూస్ట్, వర్జినియా వూల్ఫ్, హెచ్.జి. వెల్స్, సామర్సెట్ మాంలు నోబెల్ బహుమతికి అనర్హులనుకున్నారు స్టాక్‌హోం అకాడెమీ జడ్జీలు.

Q126

ఆల్ఫ్రెడ్ నోబెల్ జన్మించింది :

  1. (1) 1893
  2. (2) 1837
  3. (3) 1850
  4. (4) 1833Correct answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) 1833

  1. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో 1833లో జన్మించాడని రెండవ పేరా చెబుతోంది.
  2. ఆయన పేరు మీదే ఏటా ఇచ్చే నోబెల్ బహుమతి ఏర్పాటైందని అదే పేరా చెబుతోంది.

జాగ్రత్త: 1837లో తండ్రి రష్యా వెళ్ళాడు; 1850లో ఆల్ఫ్రెడ్ పారిస్ వెళ్ళాడు; 1893లో బోఫోర్స్ కర్మాగారాలు కొన్నాడు. ఇవి పుట్టిన సంవత్సరం కాదు.