By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 1 Telugu, Question 93

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినంత వరకు 20వ శతాబ్ది తొలి దశాబ్దులు జాతీయోద్యమం ఉధృతమైన కాలం. ఆంధ్రోద్యమం, సంఘసంస్కరణోద్యమం, గ్రంథాలయోద్యమం అన్నీ వెనుకపట్టు పట్టి, సత్యాగ్రహాలూ సహాయనిరాకరణలూ ప్రధాన ఉద్యమంగా మారిన కాలం. సోవియట్ విప్లవ ప్రభావం క్రమంగా పరుచుకుంటున్న కాలం. ప్రపంచయుద్ధ పర్యవసానంగా ముంచుకు వచ్చిన ఆర్థిక మాంద్యం తెలుగు జీవితాలను కూడా తాకిన కాలం. ప్రపంచవ్యాప్తంగా రంగం మీదకి వస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలు, పోరాటాలు, కళాసాహిత్య సిద్ధాంతాలు తెలుగు వారికి కూడా స్పర్శలోకి వస్తున్న కాలం. భాషా సాహిత్యాలకు సంబంధించి ఇది భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వానికి ప్రయాణించిన కాలం. వ్యావహారిక భాషా వాదం వచనరచనల వెల్లువ బలంతో విజేత అవుతున్న కాలం. కథ, నవల, వ్యాసం వికసించిన కాలం.

1919, మద్రాసు. కందుకూరి వీరేశలింగం మరణించిన సంవత్సరం. అస్తమయానికి కొన్ని రోజుల ముందు, 1919 మే 27వ తేదీ. మద్రాసులోని ఎగ్మూరులో కొమర్రాజు లక్ష్మణరావు ఇల్లు వేదవిలాస్. వీరేశలింగం పడకకుర్చీలో కూర్చుని స్వీయ చరిత్ర మూడో భాగం రాస్తున్నారు. అప్పటికి నలభై ఐదు పేజీలు రాశారు. ఆయన చేయి కొంచెం వణికేది. ఆఖరి పంక్తిని పూర్తి చేయలేకపోయారు. ఆ కాయితాలన్నిటిని దగ్గర ఉన్న అచంట లక్ష్మీపతికి ఇచ్చారు. కడసారి సందేశంగా ఒక చీటీ రాసి లక్ష్మీపతికి ఇచ్చారు. “నా జీవితంలో సాధించవల్సిన కార్యములింకెన్నో ఉన్నవి. అవి సాధించబడక పూర్వమే అసువులు వీడవల్సి వస్తున్నది. అయినా నా అనుచరులు, మిత్రులు, సంస్కారాభిలాషులు నా యీ మిగిలిన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. అజ్ఞానంతో, అమాయకత్వంతో జీవిత సంస్కారం లేని ప్రజాసామాన్యానికి విద్య, విజ్ఞానం, సమానత్వం, సంస్కారం కలిగించడానికి కృషి చేయాలని కోరుతున్నాను” అని ఆ సందేశంలో ఉంది. (ఆచంట లక్ష్మీపతి, మా గురువుగారు, విరేశలింగ వర్ధంతి సంచిక, 1944:5)

వీరేశలింగం నిష్క్రమణతో యుగాంతం జరిగినా సంఘసంస్కరణోద్యమాల క్షీణత 1907 నుంచే ప్రారంభమైందని వి.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత రాజకీయాలది పైచేయి అయిందని, ఆ కాలంలోనే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి రావడం, స్వదేశీ ఉద్యమం పుంజుకోవడం, సంస్కరణల కంటె రాజకీయ కార్యవాదుల మాట నెగ్గుతూ రావడం, ఇంతలో ఆంధ్రోద్యమం ముందుకు రావడం జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే 1907 తరువాత కానీ, 1919 తరువాత కానీ సంఘసంస్కరణ అనేది అంతరించిపోయినట్లు కాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. “...సూర్యరశ్మి మొక్కల చేత గ్రహింపబడినట్లు అది కండ్లకు కనిపించకుండా, నిశ్శబ్దంగా బౌద్ధిక వాతావరణంలో భాగమైంది, తరువాతి తరాన్ని నిర్మించిన పదార్థమైందని” ఆయన అన్నారు. (ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు, 1986 : 136)

సంఘసంస్కరణలు తెర వెనుకకు పోగా, తెర ముందున్నవి ఆంధ్రోద్యమం, జాతీయోద్యమం. 1905లో జరిగిన బెంగాల్ విభజన దేశమంతటా భాషా జాతీయభావాలను ప్రేరేపించగా, 1911లో పట్టాభిషేకం కానుకగా ఐదో జార్జి బెంగాల్ విభజనను రద్దు చేయడమే కాకుండా, బంగ్లా భాష మాట్లాడే వారి కోసం బెంగాల్ రాష్ట్రాన్ని, హిందీ మాట్లాడే వారి కోసం బిహారు రాష్ట్రాన్ని, అస్సామీస్ భాషీయుల కోసం అస్సామ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఒకేసారి మూడు ఏకభాషా రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేసరికి దాని ప్రభావం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు జిల్లాల మీద బాగా పడింది. అప్పటికే గవర్నర్ జనరల్ హార్డింజి భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫారసు చేశాడు. ఈ సిఫారసు, బెంగాల్ విభజనను రద్దుచేస్తూ, జార్జి చక్రవర్తి చేసిన ప్రకటనా కలిపి భాషాప్రయుక్త రాష్ట్రాలకు మేగ్నాకార్టా వంటివని చరిత్రకారులు రాశారు. [G.V.Subbarao, History of Andhra movement, (Andhra Region) Vol:1, 1982:89]

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఇతర భాషీయులతో సమానావకాశాలు కల్పించాలనే ఆకాంక్ష నుంచి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆవిర్భవించింది. 1895 నుంచి సైన్యంలోకి ఆంధ్రులను తీసుకోవడం మానేశారు. ఈ వివక్ష తెలుగు మాట్లాడే ముస్లిముల మీదా, క్రైస్తవుల మీదా లేదు. 1910 కంటె ముందు మద్రాసు ప్రొవిన్షియల్ మహాసభలు మద్రాసీలకు సైన్యంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ ఉండేవి. 1910 తరువాత నుంచి తెలుగు పత్రికలు ఈ డిమాండ్‌ను ప్రచారం చేస్తూ వచ్చాయి. సైనిక సర్వీసుల్లోకి తెలుగు హిందువులను తీసుకోకపోవడం ఒక అవమానంగా అనిపించింది. ఈ సమయంలోనే 1910లో చిలుకూరి వీరభద్రరావు ‘ఆంధ్రుల చరిత్రము’ వచ్చింది. అది విజ్ఞాన చంద్రిక ప్రచురణ. అది ఆంధ్రుల వైభవ గతాన్ని చాటిచెప్పింది. సైనిక సర్వీసులలోనే కాకుండా విద్యా ఉద్యోగావకాశాల్లో కూడా తమిళులకు, తెలుగువారికి మధ్య ఉన్న వివక్షను ప్రశ్నించడం మొదలయింది. తెలుగువారి వికాసానికి అవసరమయిన రాజధాని నగరం లేకపోవడం ఒక లోటుగా కనిపించింది. ఆ సమయంలో జె.గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, న్యాపతి నారాయణరావు, చట్టి నరసింగరావు, జి.సీతారామశాస్త్రి, ఎన్.వి.ఎన్. నరసింహారావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలయిన వారు తెలుగువారి వెనుకబాటుతనం గురించి, దాని నివారణ గురించి విరివిగా పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ నేపథ్యంలో 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. (ఈ సభకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారని ఆంధ్రపత్రిక వారపత్రిక రాసింది.) అప్పటికి ఆంధ్రపత్రిక ఇంకా ఆంధ్రదేశానికి రాలేదు. కానీ కృష్ణాపత్రిక రంగంలో ఉన్నది. అది కాక, బొంబాయి నుంచి వచ్చే ఆంధ్రపత్రిక వారపత్రిక, బొంబాయి నుంచి వచ్చే శశిలేఖ, స్వదేశీ మిత్రన్, హిందూ నేషన్, ఇండియన్ పేట్రియాట్, గుంటూరు నుంచి వెలువడే దర్బార్, తెనాలి నుంచి వచ్చే ధర్మ ప్రకాశిక, వెంకటేశ పత్రిక, రాజమండ్రి నుంచి వచ్చే దేశమాత, ఆంధ్రకేసరి, ఇంకా ఆంధ్రవాణి, భరత మాత, రవి, హితకారిణి వంటి అనేక పత్రికలు ఆంధ్రోద్యమం ఆవిర్భావానికి కారణమయ్యాయి. దోహదం చేశాయి. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ రాజ్య ఆంధ్రోద్యమం ఆవిర్భవించినప్పుడు తెలంగాణ నుంచి తెలుగు పత్రిక ఒక్కటి కూడా లేదని, ఇంగ్లీషు, ఉర్దూ పత్రికల్లో కూడా ఇటువంటి జాతీయ భావాలను సమర్థించే పత్రికలు లేవని తరువాతి అధ్యాయాల్లో గమనించవచ్చు.

అంతకు ముందే 1907–08లో బందరులో నిజాం రాజ్యానికీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికీ చెందిన తెలుగువారి సంయుక్త సమావేశం జరిగింది. 1912 మే నెలలో నిడదవోలులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల రాజకీయ, సంస్కరణలు జరిపినపుడు గుంటూరు జిల్లా కార్యదర్శిగా హాజరయిన ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కానీ అది నెగ్గలేదు. ఆ సందర్భంలోనే తెలంగాణ కూడా చేరిన విశాలాంధ్రపటాన్ని జొన్నవిత్తుల గురునాథం అనే ఆయనతో కలసి ఉన్నవ రూపొందించాడు.

రెండో ఆంధ్ర మహాసభ బెజవాడలో 1914 మేలో జరిగింది. ఆ సంవత్సరమే ఆంధ్ర పత్రిక మద్రాసు తరలివచ్చింది. మూడో ఆంధ్ర మహాసభ 1915లో విశాఖపట్టణంలో జరిగింది. నాలుగో మహాసభ కాకినాడలో 1916లో జరిగింది. అయిదవది 1917లో నెల్లూరులో, ఆరవ మహాసభ 1918లో కడపలో జరిగాయి. 1917లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. 1919లో అనంతపురంలో ఏడవ మహాసభ, 1920లో ఎనిమిదో మహాసభ జరిగాయి. మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ నివేదిక విషయంపై ప్రత్యేకాంధ్ర కాంగ్రెస్ మహాసభ 1918లో గుంటూరులో జరిగింది. 1919లో గాంధీ మద్రాసు వచ్చారు. రౌలట్ సత్యాగ్రహంలో పాల్గొనమని టంగుటూరి ప్రకాశాన్ని కోరగా, ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1916 నుంచి ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మహాసభ ఆమోదిస్తూనే ఉంది. 1919 నుంచి దేశంలో రాజకీయ ఉద్యమం వేగం పుంజుకోవడం, 1921లో గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం కావడంతో ఆంధ్రమహాసభ ఆంధ్ర గ్రంథాలయోద్యమాలు ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి.

ఈ మధ్య కాలంలో ఆంధ్రోద్యమంలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తగాదాలు ఎన్నో జరిగాయి. 1915లో విజయవాడలో జరిగిన రెండో ఆంధ్ర మహాసభకు కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం కూడా హాజరయ్యారు. ఆంధ్ర మహాసభలు తమ తీర్మానాల్లో సంఘసంస్కరణాంశాలు కూడా చేర్చుకునేవి. 1915లో బెజవాడ రామమోహన ధర్మ గ్రంథాలయ వార్షికోత్సవంలో రాయప్రోలు సుబ్బారావు ‘ఆంధ్రాభిమాన పూరితమైన పద్యములను రచించి మనోజ్ఞము’ గా చదివారు. ఈ సభకు హైదరాబాద్ రాజ్యానికి చెందిన పింగిలి వేంకట్రామా రెడ్డి అధ్యక్షులుగా వచ్చారు. ఈ సభ నాటికే రాయప్రోలు సుబ్బారావు ‘స్నేహలత’ వెలువడింది. 1911లో కొండా వెంకటప్పయ్య ‘ఆంధ్రోద్యమము’, 1913లో భోగరాజు పట్టాభిరామయ్య, కోపల్లె హనుమంతరావు కలసి ‘ఆంధ్రరాష్ట్రము’ అన్న గ్రంథాలు రాశారు.

హైదరాబాద్, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రతినిధులతో 1906లో ఏర్పడిన విజ్ఞానచంద్రికా మండలికి అనుబంధంగా 1912లో విజ్ఞాన చంద్రికా పరిషత్తు అనే సంస్థను పెట్టి పరీక్షలు నిర్వహించారు. దీనికి గుంటూరు, బందరు, బెజవాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు నెలకొల్పారు. ఈ పరిషత్తు పరీక్షాధికారులుగా కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి, వనప్పాకం శ్రీనివాసాచార్యులు మొదలైన ఉద్ధండులు వ్యవహరించారు. 1915 నుంచి కొమర్రాజు వేంకటలక్ష్మణరావు విజ్ఞానసర్వస్వము ప్రాజెక్టు ప్రారంభమైంది. అది అ, ఆ ల దగ్గరే ఆగిపోయినా 2000 పేజీలకు పైగా పుస్తక రూపంలో వెలువడింది. ఇంతలో కొమర్రాజు లక్ష్మణారావు 1923లో మరణించారు. ఆ తరువాత అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో కొంతకాలం విజ్ఞానచంద్రిక కొనసాగింది. మునగాల రాజా నాయని వేంకటరంగారావు 1920 నాటికి రాజకీయాలకు దూరం అయ్యారు. లక్ష్మణరావు జీవించి ఉండగానే ఆయన విజ్ఞానచంద్రిక నుంచి తప్పుకున్నారు. 1920 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వేంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలైన వారు రాజకీయ, సంఘసంస్కార రంగంలో ఉన్నారు. అయినా అందరి మొగ్గూ రాజకీయాల మీదే ఉన్నది.

Q93

గాంధీ మద్రాసు వచ్చిన సంవత్సరం :

  1. (1) 1914
  2. (2) 1919Correct answer
  3. (3) 1913
  4. (4) 1907

Solution.

CBSE answer: (2)

జవాబు: (2) 1919

  1. వ్యాసంలో '1919లో గాంధీ మద్రాసు వచ్చారు' అని నేరుగా ఉంది.
  2. అప్పుడు గాంధీ రౌలట్ సత్యాగ్రహంలో పాల్గొనమని కోరగా టంగుటూరి ప్రకాశం కాంగ్రెస్‌లో చేరారు.

జాగ్రత్త: 1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ సంవత్సరం, 1914 రెండో మహాసభ సంవత్సరం, 1907 సంఘసంస్కరణ క్షీణత మొదలైన సంవత్సరం; ఇవి గాంధీ రాకకు సంబంధించినవి కావు.