By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 1 Telugu, Question 128

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెలుగులో సంస్కృతం నుండి అనువదించబడ్డ రచనలే కాక బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల నుండి అనువదించబడిన రచనలు కూడా ఉన్నాయి. ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదించేటపుడు అనువాదకులు సామాన్యంగా రెండు పద్ధతులు అవలంబిస్తారు. ఒకటి యధాతథానువాదం, రెండు మూలానికి కొద్ది మార్పులు చేసి అనువదించడం. వీటిలో మన రచయితలు మొదటి పద్ధతిని అనుకరించారని చెప్పుకోవచ్చు. మన దేశంలో నాటికా రచనకు దారి చూపినవారు బెంగాలీ నాటకకర్తలు. వీరిలో రవీంద్రనాథ్ ఠాగూర్, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, బంకించంద్ర ఛటర్జీ ముఖ్యులు. తెలుగు భాషలోకి ప్రప్రథమంగా బెంగాలీ ఏకాంకికలను అనువదించిన వారు వేంకట పార్వతీశ్వర కవులు. వీరు మొదట బంకించంద్రుని రచన ‘పుష్పనాటకం’ అనే పేర 1924లో అనువదించారు. తదుపరి కుందూరి ఈశ్వరదత్తు అనువదించిన రవీంద్రుని ‘కాలరథం’. మొక్కపాటి నరసింహ శాస్త్రి అనువదించిన రవీంద్రుని ‘సోమకుడు–ఋత్వికుడు’ అనేవి ప్రచురింపబడ్డాయి. తదుపరి చాలాకాలం వరకు బెంగాలీ ఏకాంకికలు అనువాదం కాలేదు. తిరిగి 1943లో డా॥ బెజవాడ గోపాలరెడ్డి రవీంద్రుని రచనలను అనువదించారు. 1951లో అవి ప్రప్రథమంగా ‘రవీంద్రుని ఆరు నాటికలు’ అనే పేర ప్రచురింపబడ్డాయి. ఈ సంపుటంలో ‘గాంధారి ఆవేదన’, ‘భాషా చందనము’, ‘సహగమనము’, ‘పతిత’, ‘నరకవాసము’, ‘కర్ణకుంతీ సంవాదము’ అనే ఆరు రూపకాలున్నాయి. వీటిలో ‘నరకవాసము’ అనే దాన్ని ‘సోమకుడు–ఋత్వికుడు’ అనే పేర మొక్కపాటి నరసింహశాస్త్రి, రెంటాల గోపాలకృష్ణ అనువదించారు. డా॥ బెజవాడ గోపాలరెడ్డి తెలుగులోకి అనువదించేటప్పుడు వంగభాషా పలుకుబడిని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సంభాషణల్లో భావగాంభీర్యంతో ఒప్పే పదజాలాన్ని ప్రయోగించారు. శ్రీనివాస చక్రవర్తి కూడా 1961లో రవీంద్రుని ఒకానొక ఏకాంకికను ‘నందిని’ పేర అనువదించారు. మొత్తం మీద బెంగాలీ నుండి రవీంద్రుని ఏకాంకికలే ఎక్కువగా అనువదించబడ్డాయని చెప్పవచ్చు.
బెంగాలీ తరువాత దక్షిణ భాషా పుస్తక సంస్థ వారి ప్రోత్సాహంతో మన రచయితలు మలయాళ, కన్నడ, తమిళ భాషల నుండి అనువదించిన రచనల్ని గురించి చెప్పాల్సి ఉంది. ద్రావిడ భాషల్లో మొదట మలయాళ భాషలో కుట్టిపుజు కృష్ణపిళ్ళై సంకలనం చేసిన రూపకాలను తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు ‘తీరని బాకీ’ అనే సంపుటంగా ఆంధ్రీకరించారు. ఇందులో సి.జె.థామస్ రాసిన ‘శాలోమీ’, కుట్టి కృష్ణన్ ‘తీరని బాకీ’, తీక్కొడియన్ ‘ఏకాదశి’, చెరకాడ్ ‘బాకీ’, ఇరశ్శేరి గోవిందనాయర్ విశంకట సంబంధాలు, డిఫ్ ‘స్వప్నమేఖల’, ఎన్.కృష్ణపిళ్ళై ‘బంధాలు’, మలయట్టార్ రామకృష్ణన్ ‘తాజ్ మహల్’ అనే రూపకాలున్నాయి. వీటిలో మొదటిది, చివరిది తప్ప మిగిలిన రూపకాలన్నీ నాటికలే. ఇవి మలయాళ నాటకరంగ ప్రగతిని సూచించేందుకు తోడ్పడుతాయి. పుట్టపర్తి నారాయణాచార్యులు వీటిని యధాతథంగా అనువదించారు. వీరు కవి పండితులైనందున కొన్ని సందర్భాల్లో గ్రాంథిక భాషా పదాలు ఉపయోగించడం తప్పనిసరయింది.
తెలుగులో మలయాళ రూపక అనువాదాల తరువాత కన్నడ రూపక అనువాదాలు వచ్చాయి. 1960 ఏప్రిల్‌లో శ్రీరంగ ఎన్. కస్తూరి కన్నడ భాషలో సంపుటీకరించిన రూపకాలు ‘చెప్పుడు మాటలు’ అనే పేర తిరుమల రామచంద్ర అనువదించారు. ఈ సంపుటిలో శ్రీరంగ ‘సంపద్ధర్మం’, రాజేంద్ర ‘జాతర’, పర్వతవాణి ‘వార్షికోత్సవం’, ఎన్.కె. ‘చెప్పుడు మాటలు’, శ్రీ ఎన్. కస్తూరి ‘అతిథి మర్యాద’, ‘క్షీరసాగరం’, ‘మా ఊరికి పశ్చిమాన’ అనే రూపకాలున్నాయి. తెలుగు భాషలో వలెనే నాటిక కన్నడంలో కూడా నూతన ప్రక్రియ. కన్నడ రచనలు అనువదించేటపుడు తిరుమల రామచంద్ర శ్రీరంగ ఎన్. కస్తూరి రాసిన పీఠికను కూడా యధాతథంగా అనువదించారు. దీనివల్ల కన్నడ సాహిత్య ఏకాంకికల ఆవిర్భావం, వికాస పరిణామాలు తెలుస్తున్నవి. మొత్తం నాటికల్లో ‘సంపద్ధర్మం’ అనేది మాత్రం కొన్ని మార్పులతో రచితమైంది. సంభాషణలు మూలంలోని భావాలను వ్యక్తీకరించేవిగా ఉన్నాయి. సంభాషణల్లో పాత్రల సహజత్వం ఉట్టిపడే విధంగా రచించేందుకు తిరుమల రామచంద్ర ప్రయత్నించారు.
కన్నడ, తమిళ రచనలు దాదాపు ఏకకాలంలో తెలుగులో అనువదించబడ్డాయి. 1960 ఏప్రిల్‌లో తమిళంలో సా.సోమసుందరం సంకలనం చేసిన ప్రసిద్ధ తమిళ రూపకాలు ‘నవనాటికలు’ అనే పేర ప్రకటితమైనాయి. ఈ సంపుటిని శ్రీవాత్సవ అనువదించారు. ఇందులో ‘సౌందర్య మోహనము’, ‘కడసారి పిల్లాడు (సోమసుందర్), ధర్మపరీక్ష (వీరబాహు), రేపు తప్పదు సార్, వుదుమైపితన్, పిల్లల మనసు (వలియప్ప), ఓటమి (ఎన్. సుబ్రహ్మణ్యం), అల్లుడుగారొచ్చారు అనే రూపకాలున్నాయి.
మలయాళ, కన్నడ, తమిళ భాషల నుండే కాక హిందీ నుండి అనూదితమైన ఒకటి రెండు ఏకాంకికలు కూడా ఉన్నాయి. బి.ఎన్. సూరి బీబీ ఫాతిమా (చతురసేన శాస్త్రి), శ్రీమన్నారాయణ ఆటంబాంబు (ఖాజా అహ్మద్ అబ్బాస్) గొల్లపూడి మరుతీరావు హిందీ కథ ఆధారంగా వ్రాసిన ‘పగ’ ఇత్యాదులు. ఇటీవలి కాలంలో (1980) నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు, చంద్రగుప్త విద్యాలంకార్ సంపాదకత్వంలో ఆర్.శాంతసుందరి అనువదించిన పది హిందీ నాటికలని పుస్తకంగా ప్రచురించారు.

Q128

‘తీరని బాకీ’ ఆంధ్రీకరించిన సంపుటి ఎవరిది?

  1. (1) బెజవాడ గోపాలరెడ్డి
  2. (2) కందుకూరి ఈశ్వరదత్తు
  3. (3) పుట్టపర్తి నారాయణాచార్యులుCorrect answer
  4. (4) తిరుమల రామచంద్ర

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) పుట్టపర్తి నారాయణాచార్యులు

  1. కుట్టిపుజు కృష్ణపిళ్ళై సంకలనం చేసిన మలయాళ రూపకాలను పుట్టపర్తి నారాయణాచార్యులు 'తీరని బాకీ' అనే సంపుటంగా ఆంధ్రీకరించారని వ్యాసం చెబుతుంది.
  2. ఆయన వాటిని యధాతథంగా అనువదించారు.

జాగ్రత్త: తిరుమల రామచంద్ర కన్నడ సంపుటి 'చెప్పుడు మాటలు' అనువాదకుడు.