పాజ్ మాతృమూర్తి పేరు :
- (1) ఎలెనా గార్లోని
- (2) మారీ జోన్ ట్రోమిని
- (3) గార్రో
- (4) జోసెఫెనాలోజానో
సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 91 నుండి 99 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి.
కవిత్వానికి 1990లో నోబెల్ బహుమతి పొందిన మొదటి మెక్సికన్ కవి, రచయిత, దౌత్యవేత్త ఓక్టావియోపాజ్, మెక్సికో నగరంలో జన్మించారు. తల్లి జోసెఫెనా లోజానో ది స్పానిష్ సంతతి. తండ్రి ఓక్టానియో పాజ్ సొలోర్జనో, న్యాయవాది. మెక్సికో విప్లవకాలంలో జపాటాని సమర్థించారు. చెప్పుకోదగ్గ వ్యవసాయక సంస్కరణలు చేసారు. అప్పటి డైయాజ్ పాలనకు వ్యతిరేకి అయిన, ఎమిలియానో జపాటాకి కార్యదర్శిగా పనిచేశారు. వెదికి వెదికి జపాటా చంపబడ్డప్పుడు, దానికి భయపడి, పాజ్ కుటుంబమంతా కొన్నాళ్లబాటు అమెరికా వలసపోయారు. తాత ఇరెనివో పాజ్ విలేఖరి. నవలాకారుడు. బాల్యం నుండీ వయస్సుకు మించిన మేధావి కావడంతో తాతయ్య విస్తృత గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుకుంటూ గడిపేవారు. అందులో ఏడువేల పుస్తకాల వరకూ ఉండేవి. అప్పుడు చదువుకున్న వోల్టెయిర్ రచనల మూలానే ఆయన నాస్తికులయ్యారని చెప్పుకునేవారు. జీవితమంతా నిరంతరం చదువుతోనే ఉండేవారు.
యువకుడిగా ఉన్నప్పటి నుంచే కవి కావాలని కలలు కన్నారు. మెక్సికోలో చదువు పూర్తయాక ఉపకార వేతనం మీద, కవిత్వం కోసం పాజ్ అమెరికా వెళ్లారు. అప్పట్లో మెక్సికన్ అతర్యుద్ధం మూలాన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. వీరికి రాజకీయాల్లో రుచి ఎక్కువ. సమాజవాదిగా తనకు తానే ప్రకటించుకున్నారు.
1937లో స్పానిష్ అంతర్యుద్ధం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు, ప్రజాతంత్రవాదిగా, స్టాలిన్ విరోధిగా అక్కడి రచయితలకు సంఘీభావంగా స్పెయిన్ వెళ్లారు. అప్పుడే పెళ్లి చేసుకున్న భార్య ఎలెనా గార్లోని తనతోబాటు వెంట తీసుకువెళ్లారు. వీరికి ఒక కుమార్తె గార్రో పేరుపొందిన నవలాకారిణి. సినిమా రచయిత్రి కూడా. 1937లో వివాహం చేసుకుని 1959లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత భారతదేశంలో పరిచయమైన ఫ్రెంచి మహిళ మారీ జోస్ ట్రామిని, భారతదేశంలోనే ఢిల్లీలోని తన నివాసానికి దగ్గర్లో వేపచెట్టు కింద వివాహం చేసుకున్నారు.
1938లో మెక్సికోకి తిరిగొచ్చాక పాజ్ స్వయాన ఒక సాహిత్య రాజకీయ పత్రికను నెలకొల్పారు. 19 ఏళ్లప్రాయంలో ఆయన మొదటి కవిత్వ సంపుటి ‘అడవి చంద్రుడు’ వెలువడింది. 1944లో గుగ్గెన్ హైం ఫెలోషిప్ పొంది, న్యూయార్క్లోను, సాన్ఫ్రాన్సిస్కోలోను, స్పానిష్ అమెరికన్ కవిత్వం చదివారు. అది ఉత్తర అమెరికా, మెక్సికన్ల నాగరికతలు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. 1950లో వచ్చిన ఆయన ‘నిర్జనప్రదేశపు పద్మవ్యూహం’ సంకలనానికి అదే నాంది. మెక్సికన్ – స్వభావం, చరిత్రకు వ్యాఖ్యానం, మానసిక ప్రభావం అందులో అద్భుతంగా చిత్రితమైనాయి. ఆధునికవాదం, అధివాస్తవికత ఆయన్ని ఎక్కువగా ఆకర్షించిన విషయాలు.
1945లో పాజ్ మెక్సికో దౌత్యసంబంధ విభాగంలో చేరి ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్లో వివిధ హోదాల్లో పనిచేసారు. 1962 నుండి 1968 వరకూ భారతదేశంలో మెక్సికో రాయబారిగా ఉన్నారు. మెక్సికో నగరంలో ప్లాజా ట్లాటెలోకో విద్యార్థుల పట్ల జరిగిన అమానుషాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద పదవీ వరమణ చేసి, తనకు తానే విధించుకున్న ప్రవాసంలోకి వెళ్లిపోయారు. ‘వ్యాకరణవేత్త కోతి (రాజస్థాన్ పర్యటన ఆధారంగా నవల)’, ‘తూర్పు నిమ్నత (కవిత్వం)’ ఈ రెండూ భారతదేశంలో ఉన్నప్పుడు రాసినవే. 1969లో కేంబ్రిడ్జ్లోను, 1971–72 మధ్య హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోను గడిపారు. ఆ తరువాత మెక్సికోకి తిరిగొచ్చి ప్లూరల్ సాహిత్య సాంస్కృతిక దినపత్రికను నడిపారు. 1976లో మరో మాసపత్రిక వ్యూల్టాను అదే పద్ధతిలో ప్రారంభించారు. ఈ రెండు పత్రికలు మెక్సికో సాహిత్య ప్రస్థానానికి గణనీయమైన సేవచేసాయి.
పాజ్ వామపక్ష భావాలున్నా అతివాదాన్ని, మానవహక్కుల హననాన్ని నిరసించేవారు. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ల అహింసావాదంతో ఏకీభవించినా నిర్మలమైన హింసను సమర్థించారు. 1976లో వచ్చిన ‘ప్రత్యామ్నాయ ప్రవాహం’లో, తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు, ఎదిరించేవాడి మధ్య ప్రత్యేకతల్ని స్పష్టంగా ప్రస్తావించారు.
పాజ్ రచనలు అనేక భాషల్లోకి తర్జుమా అయినాయి. ఎలియట్ వెయిన్ బెర్గర్ ఆయన రచనల్ని ఎక్కువగా ఆంగ్లంలోకి అనువాదం చేసారు. వీరి అనువాద కవితల సంకలనాలు హిందీ, బెంగాలీలో వచ్చాయి. 1937లో ‘నీ స్పష్టమైన నీడ కింద ఇంకా ఇతర కవితలు’, 1957లో ‘లోపలి వృక్షం’ మొదలైనవి వచ్చాయి. 1980 లో హార్వర్డ్, 1984లో న్యూయార్క్ విశ్వవిద్యాలయాలు ఆయన్ని గౌరవ పట్టాలతో సత్కరించాయి. వచ్చిన పురస్కారాల్లో – 1977 జెరూసలేం, మెక్సికో సాహిత్య పురస్కారాలు, 1981లో సెర్వాంటీ బహుమతి, 1984లో జర్మని పుస్తక విక్రేతల శాంతి బహుమతి, 1987లో స్పెయిన్ మెనెండెజ్ పెలాయో బహుమతి ముఖ్యమైనవి. చివరికి 1990లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన సాహిత్యానికి మచ్చుతునకగా నోబెల్ బహుమతి ప్రదాతలు, ఆయన కవిత ‘నేను చూస్తున్న దానికి చేస్తున్నదానికి మధ్య’ను ఉదహరించారు. పాబ్లో నెరూడాతోను, గాబ్రియల్ గార్సియా మార్క్వేజ్తోనూ, సాహిత్యపరంగా ఎంత దగ్గరతనమున్నా రాజకీయ కారణాలతో వైరుధ్యాలుండేవి. అప్పుడు రాసినదే ఈ కవిత. ఆయన సమగ్ర సంపుటి 1994లో వచ్చింది. 1933 నుండి 40కి పైగా పుస్తకాలొచ్చాయి. వీటిల్లో ఎక్కువ భాగం కవిత్వం, తతిమ్మావి వ్యాసాలు, నాటకాలు, ఉత్తరాలు వగైరా.
పాజ్ రెండు పుస్తకాలు ‘భారతదేశ కాంతి ఇంకా రెండు ఉద్యానవనాల వృత్తాంతం’, ‘1952–1955 మధ్య భారతదేశం నుండి కవితలు’, 1997లో వచ్చాయి. ‘భారతదేశం కాంతి ఇంకా రెండు ఉద్యానవనాల వృత్తాంతం’ అన్న వ్యాస సంపుటిలో భారతదేశంలో ఉన్న తక్కువ సమయం (1960–1968) తన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిందిగా ఆయన రాసుకున్నారు. తన మాతృదేశాన్ని పరీక్షించుకునేందుకు భారతదేశం ఒక మంచి అద్దం అని పాజ్ బలంగా నమ్మారు.
పాజ్ మాతృమూర్తి పేరు :
CBSE answer: (4)
జవాబు: (4) జోసెఫెనాలోజానో
జాగ్రత్త: వ్యాసంలో చాలా మంది స్త్రీల పేర్లు ఉన్నాయి; 'తల్లి' అనే పదం పక్కన ఉన్న పేరునే ఎంచుకోవాలి.