By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 2 Telugu, Question 133

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింద ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1931 నుండి 1943 వరకూ పదమూడు సినిమాలలో నటించిన ఖుర్షీద్ సినిమా పాటలపై తనదైన ముద్ర వేసింది. 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఖుర్షీద్ అప్పటి ఆనవాయితీ ప్రకారం తన పాటలు తానే పాడుకునేది. కానీ ఖుర్షీద్‌కు సంగీతంలో ఎటువంటి శిక్షణ లేదు. ఆమె స్వరం మరీ బలహీనంగా ఉండేది. పాటలు విన్నవారికి శాంతిగా అనిపించేది. ఆమె పెద్దగా హై పిచ్‌లో పాడగలిగేది కాదు. అందుకే ఆమె తన గాన ప్రతిభ వల్ల కాక స్వరమాధుర్యం వల్లనే చక్కటి గాయనిగా గుర్తింపు పొందింది. ఆమె దీర్ఘంగా రాగాలు తీయగలిగేది కాదు. ఎప్పుడైనా రాగం తీయవలసి వస్తే స్వరంలో వణుకు స్పష్టంగా తెలిసేది. పాటలు ఎలా పాడమంటే అలా పాడేది తప్ప, గాయనిగా తనవైపు నుంచి బాణీకి ప్రత్యేకతను ఆపాదించగలిగేది కాదు. అందుకే ఖేమ్‌చంద్ ప్రకాశ్ ‘ముంతాజ్ (1943)’ సినిమాలో ‘దిల్ కో ధడ్‌కన్ బనాలియా’ పాటలో ఖుర్షీద్ ఒక పాదం పాడగానే, దానికి అనుబంధంగా వాయిద్యాలతో పాటను సుందరం చేయాలని ప్రయత్నించాడు. అయితే, తన పాటలు తానే పాడుకునేది కాబట్టి ఆమెను నేపథ్య గాయనిగా పరిగణించే వీలు లేదు.
అమీర్ బాయి కర్ణాటకి నటిగా తెరపైకి వచ్చినా గాయనిగానే ఆమెను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. 1940 నుంచి 1950 నడుమ ఆమె దాదాపు 225 పాటలు పాడింది. ఆ కాలంలో గొప్ప హిట్ పాటలు పాడింది. కిస్మత్ (1943) సినిమాలో ‘ధిరే ధీరే ఆరె బాదల్’, రతన్ (1944) సినిమాలో ‘మిల్ కే చిఛడ్ గయే అఖియాన్’, సమాధి (1950)’లో ‘గోరే గోరే ఓ బాన్కే చోరే’ వంటి హిట్ పాటలు పాడింది అమీర్ బాయి కర్ణాటకి. ఈమె కుడా శిక్షణ పొందిన గాయని కాదు. ఆమె స్వరం శక్తివంతమైనది. ఈమె పాటల్లో భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచేది. పాటల్లో పదాలను కాస్త నెమ్మదిగా ఉచ్చరించటం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృజించేది. ‘కిస్మత్’ సినిమాలో ‘ఘర్ ఘర్ మే దివాలీ’ పాటలో పలు భావాలను ఒకేసారి సమర్థవంతంగా పలికించి మెప్పించింది. అయితే 1940 దశకం చివరికి వచ్చేసరికి ఈమె కుటుంబపరంగా వ్యక్తిగత సమస్యలలో చిక్కుకుంది. పాటల పై దృష్టి పెట్టలేకపోయింది. దాంతో నెమ్మదిగా సినీ పరిశ్రమకు దూరమయింది. కానీ విశ్లేషకులు లత తెరపైకి రావటం, అమీర్ బాయి కర్ణాటకి కెరీర్‌ను దెబ్బ తీసిందని వ్యాఖ్యానిస్తారు. కానీ అది పొరపాటు. 1950లో ‘సమాధి‘ సినిమాలో లత ‘గోరెగోరె’ పాటను అమీర్ బాయి కర్ణాటకితో పాడే సమాయనికి అమీర్ బాయి వ్యక్తిగత సమస్యల వల్ల పాటలను తగ్గించింది. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో నాయిక నళినీ జయవంత్‌కు లత, కుల్దీప్ షార్‌కు అమీర్ బాయి పాడారు. సాధారణంగా మన సినిమాలలో నాయికకు పాడే స్వరం నెంబర్ వన్ గాయనిది అయి ఉంటుంది. అంటే, అప్పటికే లత అగ్రస్థాయి గాయనిగా పరిగణించబడుతోందన్నమాట.
బెంగల్‌కు చెందిన గాయని అయినా నటి కానన్ దేవి పాటలో బెంగాలీ యాస కనబడేది కాదు. ఆమె స్వరం బలమైనది. హైపిచ్‌లో కీచు గొంతు వచ్చేది కాదు. ‘విద్యావతి (1938)’ సినిమాలో ‘డోలే హృదయ కీ నయ్యా’ పాటలో ఆమె హైపిచ్‌లో అద్భుతంగా పాడింది. ‘లగాన్ (1943)’లో ‘హమారీ లాజ్’ పాట, ‘హాస్పిటల్’ సినిమాలో ‘జరా నైనోంసే నైనా’ పాటలో హైపిచ్ నుంచి హఠాత్తుగా లోపిచ్‌కు సులభంగా, ఎలాంటి ప్రయాస లేకుండా దిగుతుంది ఆమె స్వరం. ‘తరానా’ కూడా అద్భుతంగా పాడగలదని ‘విద్యావతి’ సినిమాలోని ‘అంబువా కి డాలీ’ పాట నిరూపిస్తుంది. అలాగే, ‘జవాబ్ (1942)’లో ‘తుపాన్ మెయిల్, దునియా యే దునియా’ లాంటి వేగవంతమైన పాటలను కూడా సులభంగా పాడగలదు కానన్ దేవి. అయితే ఆమె పాటలు సినిమాను దాటి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు. కానీ 1946 వచ్చేసరికి కానన్ దేవి ప్రభావం, ప్రాధాన్యం తగ్గిపోయాయి.
జోహ్రాబాయి అంబాలేవాలి ‘రతన్ (1944)’ సినిమాలో ‘అఖియ మిలాకే’, ‘రుమ్ ఝుమ్ బర్సే బాదర్‌వా’ పాటలతో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందింది. 1941 నుండి 1950 నడుమ 1229 పాటలు పాడింది జోహ్రాబాయి. జోహ్రాబాయి కూడ పాట పాడటంలో శిక్షణ పొందలేదు. ఆమె స్వరం వేగవంతమైన పాటల్లో అందంగా ధ్వనించటంతో సంగీత దర్శకులు ఆమెతో వేగవంతమైన పాటలు పాడించేందుకే ఉత్సాహం చూపారు. దాంతో ఆమెకు బాణీని అనుసరించి స్పష్టంగా పాడటం తప్ప తన ప్రతిభను ప్రదర్శించి, పాటకు మెరుపులు అద్దే వీలు చిక్కలేదు. అయినా సరే తనకున్న పరిమిత పరిధిలో అక్కడో పదాన్ని, ఇక్కడో పదాన్ని విభిన్నంగా ఉచ్చరించటం ద్వారా, పాటలో అభినయాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించింది జోహ్రాబాయి. ‘జీవన్ (1944)’ సినిమాలో ‘నెనోమే నైనా మత్ డాల్’, ‘చంద్రలేఖ (1948)’లో ‘మేరా హుస్న్ లూట్ లియా’ వంటి పాటలు ఇందుకు చక్కని ఉదాహరణలు. ‘సమఝ్ లో నజర్ కే ఇషారే’ (కశ్మీర్), ‘క్యా బతాయే కిత్ని హస్రత్’ (నాటక్), ‘ఫిర్ ఆహ్ దిల్‌సే నికలీ’ (మేలా) వంటి ‘గజల్స్’ను అద్భుతంగా పాడింది జోహ్రాబాయి. కానీ సంగీత దర్శకులు ఆమెను వేగవంతమైన పాటలకే అధికంగా పరిమితం చెయటంతో, విభిన్నమైన పాటలు పాడగలిగి ఉండి కూడా కొన్ని రకాల పాటలకే పరిమితమయింది జోహ్రాబాయి. ఈమె 1953లో సినిమాలలో పాడడం నుంచి విరమించుకుంది.
సురయ్య ‘తాజ్‌మహల్’ సినిమాతో 1941లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే సురయ్య ప్రధానంగా తన పాటలు తానే పాడుకునేది. దాంతో నేపథ్య గాయనిలు ఎవరితోనూ ఆమెకు పోటీ లేదు. గాయనిగా తనదైన ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. నటిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆరంభంలో ‘స్టేషన్ మాస్టర్’ (1942) సినిమాలో నేపథ్య గాయనిగా పాడింది. ‘శారద’ సినిమాలో ’మెహ్తాబ్’కు ‘పంచీ జా పీఛే రహాహై బచ్ పన్’ అనే పాటను పాడింది. కానీ నటిగా పేరు సాధించిన తర్వాత ఆమె తన పాటలు మాత్రమే పాడుకుంది. అంటే ఎందరు నేపథ్య గాయనిలు వచ్చినా ఆమెకు ఎవరితోనూ పోటీలేదు. ఎవరికీ ఆమే పోటీ కాదు.
రాజ్‌కుమారి సైతం తన పాటలు తానే పాడుకునే నటిగా సినీ రంగంలో అడుగుపెట్టింది. కానీ 1938 నుండి ఆమె నటనకు స్వస్తి చెప్పి నేపథ్య గానం వైపు దృష్టి పెట్టింది. రాజ్‌కుమారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా ‘టప్ప’ పాటల గానంలో శిక్షణ పొందింది. దాంతో రాగాలు తీయగలదు, ‘పల్టా’లు పాడగలదు. నాటకాలలో మైకు లేకుండా హైపిచ్‌లో పాడే అలవాటు ఉండడంతో హైపిచ్‌లో పాటలు పాడటంలో ఆమెకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఆమె స్వరం పలు రకాల భావాలను పలకగలిగేది కాదు. ముఖ్యంగా పాటలో ‘నాసల్ టోన్’ రావటం ఇబ్బంది కలిగించేది. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె ‘పాటలు పాడటంలో నా పరిధి పరిమితం’ అని చెప్పింది. అయితే 1950 దశకం ఆరంభం నుంచీ ఆమె పాటలు పాడటం తగ్గించింది. 1950 చివరికల్లా ఆమె స్వరం సినిమాల్లో వినిపించటం మానేసింది.

Q133

‘డోలే హృదయ్‌కీ నయ్యా’ పాటను పాడింది :

  1. (1) ఖుర్షీద్
  2. (2) లతా మంగేష్కర్
  3. (3) కానన్ దేవిCorrect answer
  4. (4) జోహ్రాబాయి అంబాలేవాలీ

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) కానన్ దేవి

  1. బెంగాల్ గాయని కానన్ దేవి 'విద్యావతి (1938)' సినిమాలో 'డోలే హృదయ కీ నయ్యా' పాటను హైపిచ్‌లో అద్భుతంగా పాడిందని వ్యాసం చెబుతోంది.
  2. ఆమె స్వరం బలమైనదని, హైపిచ్‌లో కీచుగా ఉండదని కూడా అక్కడే ఉంది.

జాగ్రత్త: (1) ఖుర్షీద్ పెద్దగా హై పిచ్‌లో పాడగలిగేది కాదని వ్యాసం చెబుతోంది; ఈ హైపిచ్ పాట ఆమెది కాదు.