By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 133

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 129 నుండి 135 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి :
ఈ వేళ మనం చూస్తున్న ‘ఆంధ్రకవుల చరిత్ర’ – వెనుక ఎంతటి కృషి ఉన్నదో, ఎంతటి నిబద్ధత, త్యాగం దాగి ఉందో తెలియకపోతే ఆ మహామనీషికి మనం వారసులమని చెప్పుకునే అర్హతలేదు.
కందుకూరి వారు సాహిత్య చరిత్ర రాయాలనుకునే కాలానికి శాస్త్రబద్ధమైన సాహిత్య రచనా ఒరవడి లేదు. ఒక దేశచరిత్రను రాయటం కంటే ఆ దేశకవుల చరిత్రను రాయటం ఎంతో కష్టమైన విషయం. వీరేశలింగం గారికి ముందు ‘Biographical Sketches of Deccan Poets’ - అనే కావలి వేంకట రామస్వామి రచన కనిపిస్తుంది. మెకంజీకి సాయపడిన కావలి సోదరులలోనివాడే ఈ రామస్వామి. ఇది 1847లో మొదటిసారి, 1888లో రెండోసారి ముద్రితమైంది. ఇందులో 46 మంది కవులను గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో ప్రస్తావించిన కొందరు కవులు ఇప్పటికీ సాహిత్య చరిత్రలకు ఎక్కలేదు.
ఆ తరువాత బ్రౌన్ 1852లో తెలుగు – ఇంగ్లీష్ నిఘంటువుకు రాసిన ఉపోద్ఘాతంలో కొందరు కవుల్ని, వాళ్ల గ్రంథాల్ని తాను సేకరించి పరిష్కరించిన గ్రంథాలకు సంబంధించిన సూచికల్ని పేర్కొన్నాడు. వీరేశలింగం గారి కంటే ముందు పత్రికలలో ఆయాకవుల చరిత్రలు, వాళ్ల గ్రంథాలను గురించిన కొన్ని చర్చలు ఉన్నాయి. ఉదాహరణకు లోకరంజని (సం.కాకర్ల సుబ్బయ్య), సకల విద్యాభివర్ధిని (సం.గూడూరు వెంకట కృష్ణారావు), పురుషార్థప్రదాయిని, అముద్రిత గ్రంథ చింతామణి, రాజయోగి, ప్రబంధ కల్పవల్లి వంటివి.
ప్రస్తావికంగా తెలుగుకవుల జీవితాల్ని వీరేశలింగం గారి కంటే ముందే గ్రంథస్థం చేసిన వాళ్ళలో బహుజనపల్లి సీతారామాచార్యులు, ఎనమండ్రము వేంకటరామయ్య గారిని ప్రస్తావించాలి. శబ్దరత్నాకరంలోని బహుజనపల్లి వారి ప్రస్తావనలు రేఖామాత్రమైనవి. వీరేశలింగంగారు కూడా శబ్దరత్నాకరంలో బహుజనపల్లివారు పేర్కొన్న కొందరు కవుల పేర్లు, వాళ్ళ గ్రంథాల పేర్లు వినటమే గాని తమకు లభించలేదని, కొన్నిటిని సంపాదించి ప్రచురించగలిగామని పేర్కొన్నారు. (స్వీయచరిత్ర 2వ భాగం, పుట 233) ఎనమండ్రము వేంకట రామయ్యగారి గ్రంథమైన పురాణనామచంద్రిక మన పూర్వగాథాలహరి వంటి గ్రంథం.
వీరేశలింగం గారి కంటే ముందు వెలువడిన గురజాడ శ్రీరామమూర్తిగారి కవులచరిత్రే మొట్టమొదటి తెలుగుసాహిత్య చరిత్రగా పేర్కొనాలి. ఎందుకంటే శ్రీరామమూర్తిగారు గ్రంథాన్ని కవుల చరిత్రగా రాయలని ఉద్దేశించాడు కాబట్టి. అయితే ఇందులో కవుల కాలవిభాగం లేదు. కాలనిర్ణయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీరేశలింగంగారి ‘ఆంధ్రకవులచరిత్ర’
వెలువడిన తరువాత, తను చేసిన కాలనిర్ణయానికి, వీరేశలింగంగారు చేసిన కాలనిర్ణయానికి వైరుధ్యమేర్పడటంతో ఆయాకవుల కాలనిర్ణయాన్ని చర్చించి మళ్లీ రెండవ ముద్రణ వెలయించారు. ఇందులో జనబాహుళ్యంలో శ్రుతమయ్యే కట్టుకథలకే అగ్రతాంబూలం. శాస్త్రీయత అంతగా కనిపించదు.అసంగతమైన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.
వీరేశలింగంగారు కవులచరిత్ర రాసే నాటికి శాసన పరిష్కరణలు సమర్థంగా జరగలేదు. కావ్యాలకు వచ్చిన సంశోధిత ముద్రణలు లేవు. తాళీదళప్రకర కాంతారంలో అసూర్యంపశ్యలుగానున్న ఎన్నో గ్రంథాల సమాచారం నామమాత్రంగా నైనా లేదు. ఒక నిర్దుష్టమైన ప్రణాళికతో రాసిన గ్రంథాలేవీ లేవు. వీరేశలింగంగారి సాహిత్య చరిత్రకు ఆనాడు ఆధారంగానున్న సామగ్రి :

  1. తంజావూరు సరస్వతీమహల్ లోని తాళపత్రాలు
  2. చెన్నపట్నంలోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం
  3. రాబర్ట్‌సీవెల్ శాసన సంపుటాలు
  4. మెకంజీ కైఫీయత్‌లు
  5. సి.పి. బ్రౌన్ సేకరించిన గ్రంథాలు
  6. ‘కార్మికేల్’ – ప్రోత్సాహంతో బుక్కపట్నం రాఘవాచార్యులు వ్రాసిన ఆంధ్రదేశచరిత్ర రాతప్రతి
    ఈ సామగ్రిని జాగ్రత్తగా విశ్లేషించుకొని ఒంటిచేత్తో కవులచరిత్రను రాశారు. మొట్టమొదట కవుల చరిత్రను 1886వ సంవత్సరంలో వివేకవర్ధనిలో సీరియల్‌గా ప్రచురించారు. అదే సంవత్సరం ప్రథమ భాగాన్ని డెబ్బైపుటలతో పుస్తక రూపంతో ప్రచురించారు. ఆ మరుసటి సంవత్సరమే అంటే 1887వ సంవత్సరంలో డెబ్బైపేజీల ఈ గ్రంధాన్ని పన్నెండు పేజీల అనుబంధంతో ప్రచురించారు. ఈ ప్రథమ భాగాన్నే 1890వ సంవత్సరంలో మూడవ ముద్రణ వెలువడింది. రెండవ ముద్రణలోని అనుబంధం ప్రధానభాగంలో చేర్చి 96 పేజీల గ్రంథంగా దీన్ని వెలువరించారు. 1895లో వచ్చిన నాల్గవ ముద్రణ 150 పుటల గ్రంథం. 72 పుటలు గల ప్రథమ భాగపు ప్రథమ ముద్రణ 1895 నాటికి రెట్టింపు అయింది. తమ సంపుటాలలో భాగంగా తిరిగి ఈ గ్రంథాన్ని 1899 నాటికి పునర్ముద్రిస్తున్న సందర్భంలో 160 పేజీల పరిమాణమైంది. ఈ తొలి భాగమే 1917వ సంవత్సరం నాటికి 684 పేజీల పరిమాణాన్ని పొందింది. దీనిని బట్టి కందుకూరి వారి నిరంతర పరిశోధన ప్రవణత ఏపాటిదో అర్థమవుతుంది. పుస్తకరూపంలో 1894లో ప్రచురించిన కవులచరిత్ర రెండోభాగాన్ని 1892–1894 సంవత్సరాల మధ్యకాలంలో చింతామణి పత్రికలో కందుకూరి ప్రకటించారు. అలాగే తృతీయభాగాన్ని 1897లో ప్రకటించారు. ఈ మూడు సంపుటాల్ని కలిపి ఒకే
    సంపుటంగా, తమ గ్రంథ సంపుటాలలో భాగంగా 1899వ సంవత్సరంలో ముద్రించారు. 1894లో ముద్రించిన కవుల చరిత్ర రెండో భాగంలోనున్న యాభైమంది కవుల సంఖ్య ఒకే సంపుటిగా ప్రచురించే నాటికి యాభై ఏడుకు పెరిగింది. మూడో భాగంలోని కవుల సంఖ్య 139. ఒకే సంపుటిగా 1899 సంవత్సరంలో ముద్రించేనాటికి కవులచరిత్రలో కూర్చబడిన కవుల సంఖ్య 218. 1917వ సంవత్సరాన పున: సంశోధించి ప్రచురించిన ఈ గ్రంథంలోని కవుల చరిత్రలు 232. మొదటి భాగంలో చెప్పిన చాలా అభిప్రాయాలు ఈ సంశోధిత ముద్రణకాలానికి మారాయి. వారు జీవించినంతకాలం కవులచరిత్రను సంస్కరిస్తూనే వచ్చారు. దానికి కారణం మానవల్లి, కొమఱ్ఱాజు, వేటూరి ప్రభాకరశాస్త్రి, వంగూరి సుబ్బారావు వంటి పరిశోధకులు కొత్త కొత్త పరిశోధనల ఫలాన్ని వెలువరించటమే. వీరేశలింగం కార్యదీక్షలోనూ, ఎప్పటికప్పుడు విజ్ఞానాత్మకంగా ఎదగటంలోనూ వెనుకబడలేదు. తన లోపాన్ని, రచనలో చేసిన దోషాన్ని సవరించుకోవటానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అది సాహిత్య చరిత్రకూ వర్తిస్తుంది. ఉదాహరణకు పోతన ఒంటిమిట్ట వాసి అనటం తరువాత సవరించుకోవటం.
    కవి కాలాదుల్ని నిర్ణయించటం, కావ్యతత్త్వ విమర్శ ఈ రెండు రెండు కళ్లుగా వీరేశలింగం గారి కవులచరిత్ర సాగుతుంది. ప్రతి కవికి సంబంధించిన కావ్యశైలిని పరిచయం చేస్తూ ఒకటి రెండు పద్యాలను ఉదాహరించటం కవులచరిత్రలో కనిపిస్తుంది. తనకు సమాచారం లేని కవులను గురించి పాఠకులకు, భావిపరిశోధకులకు వదలి వేశారే గాని ‘అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక:’ అని దబాయించలేదు. రెండో సంపుటంలో కొందరు కవుల కాలనిర్ణయాన్ని చేయలేదు. తనవి పొరపాట్లని రూఢమైనప్పుడు, ఆ సమాచారమందించిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పిమరీ సవరించుకున్నారు. రెండవ భాగంలో వీరేశలింగం పంతులుగారు చేసిన పొరపాట్లను మానవల్లి రామకృష్ణకవి ఎత్తిచూపగా వాటినన్నింటినీ తరువాత సవరించి మానవల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Q133

పురాణ నామచంద్రిక ఎవరిది ?

  1. (1) కావలి వేంకట రామస్వామి
  2. (2) మెకంజీ
  3. (3) ఎనమండ్రము వేంకటరామయ్యCorrect answer
  4. (4) కాకర్ల సుబ్బయ్య

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) ఎనమండ్రము వేంకటరామయ్య

  1. "ఎనమండ్రము వేంకట రామయ్యగారి గ్రంథమైన పురాణనామచంద్రిక" అని వ్యాసంలో నేరుగా ఉంది.
  2. కావలి వేంకట రామస్వామి రచన 'Biographical Sketches of Deccan Poets'.
  3. కాకర్ల సుబ్బయ్య 'లోకరంజని' పత్రిక సంపాదకుడు; మెకంజీ కైఫీయత్‌లకు ప్రసిద్ధుడు.
  4. ఆ గ్రంథం 'పూర్వగాథాలహరి' వంటిదని కూడా వ్యాసం చెబుతోంది.