By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 1 Telugu, Question 125

Topic: Reading comprehension

Passage

సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాసభాగమును చదివి 121 నుండి 128 వరకు గల ప్రశ్నలకు సమాధానములు రాయండి :
దక్షిణాదికి మొట్టమొదటి మహమ్మదీయ దండయాత్రను అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీ.శ. 1294లో దేవగిరి యాదవ రాజుల మీద జరిపాడు. కారా అలహాబాద్ ప్రాంతాల గవర్నర్‌గా ఉండి, ఢిల్లీ అనుమతి లేకుండానే జరిపిన అనధికార దండయాత్ర అది. దేవగిరిని ఓడించిన తరువాత ఢిల్లీ చక్రవర్తి, తన మామ అయిన సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి, 1296లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. కాకతీయుల మీదకి 1303 సంవత్సరంలో మొదటి దండయాత్రను పంపించాడు. ఇప్పటి కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి దగ్గర జరిగిన ఆ యుద్ధంలో ఖిల్జీ సైన్యం ఓడిపోయింది. 1307లో మరోసారి ఖిల్జీ దక్షిణానికి సైన్యాన్ని పంపించాడు. కానీ అది దేవగిరి లక్ష్యంగా జరిగిన దండయాత్ర. ఖిల్జీ 1309లో మాలిక్ కాఫర్‌ను కాకతీయుల మీదికి రెండో దండయాత్రకు పంపాడు. మాలిక్ కాఫర్ 1310 జనవరి 19నాడు వరంగల్ కోటను ముట్టడించాడు. రెండు నెలలపాటు ఆ దాడిని తట్టుకున్న కాకతీయ సైన్యం మార్చి 19నాడు లొంగిపోయింది. ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ విధించిన షరతులకన్నిటికీ అంగీకరించి, కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. తన ఖజానాను మొత్తంగా అప్పగించాడు. ఆ యుద్ధం ముగిసిన తరువాత ప్రతాపరుద్రుడు దక్షిణాదిలో తలెత్తిన తిరుగుబాట్లను అణచడానికి బయలుదేరి, విజయం సాధించాడు. ఆ తరువాత కంచి మీద దండయాత్ర చేసి జయించాడు. ఢిల్లీకి క్రమం తప్పకుండా కప్పం కడుతూనే ఉన్నాడు.
1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తరువాత ఢిల్లీలో వారసత్వం గురించి పోరాటం జరిగింది. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రతాపరుద్రుడు కప్పం కట్టడం మానేసి, స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. దేవగిరి పాలకుడు హరపాలుడు కూడా అదే సమయంలో తిరుగుబాటు చేశాడు. ఢిల్లీ వారసత్వపు పోరులో ఖుతుబుద్దీన్ ముబారక్ విజయం సాధించి గద్దెనెక్కాడు. దేవగిరి పాలకుడిని బందీగా తీసుకుని, మరణ శిక్ష విధించారు. ముబారక్ కు కప్పం కట్టడమే మంచిదని ప్రతాపరుద్రుడు రాజీచేసుకుని, కప్పం బాకీ చెల్లించాడు. 1320లో ఢిల్లీలో పాలకులు మారారు. ఖిల్జీలు పోయి తుగ్లక్‌లు వచ్చారు. ఘసీయుద్దీన్ తుగ్లక్ రాజయ్యాడు. రాజ్యాల మీదికి దండయాత్రలు జరిపి కప్పాలు సాధించడం అనే పూర్వవిధానాన్ని మార్చి అతను భూభాగాల అక్రమణను చేపట్టాడు. 1321లో వరంగల్ మీదికి సైన్యాన్ని పంపాడు. తరువాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా ప్రఖ్యాతుడైన ఉలగ్ ఖాన్ ఈ దండయాత్రకు నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో వరంగల్ ఓడిపోయింది. ప్రతాపరుద్రుడు పరాజితుడై బందీ అయ్యాడు. బందీగా ఢిల్లీకి తీసుకుపోతుండగా మార్గ మధ్యంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. వరంగల్ పతనం తరువాత ఉలగ్ ఖాన్ మరింత ముందుకు వెళ్లి రాజమండ్రి, నెల్లూరు మధ్య సముద్ర తీరప్రాంతాలను జయించి 1324లో కాకతీయ సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. అతను మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా 1325లో ఢిల్లీలో అధికారాన్ని చేపట్టాడు. 1335–36 ప్రాంతాల్లో ముసునూరు కాపయ నాయకత్వంలో కొందరు ఆంధ్రనాయకులు తిరిగి వరంగల్ కోటను స్వాధీనం చేసుకుని కొంతకాలం పాలించారు కాని అది ఎక్కువ కాలం నిలవలేదు. వరంగల్ పతనమై, అనేక చిన్న రాజ్యాలు ఏర్పాటయ్యాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజ్యం, రాచకొండ, దేవరకొండలలో వెలమ పద్మనాయక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవి స్వతంత్రంగానే వ్యవహరించసాగాయి.
క్రీ.శ. 1347లో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యం ఉత్తరాన బీరారు నుంచి దక్షిణాన తుంగభద్ర ఎడమగట్టు దాకా, పశ్చిమాన దాబల్ నుంచి తూర్పున తెలంగాణ దాకా వ్యాపించింది. దీని స్థాపకుడు అల్లావుద్దీన్ బహమన్ షా (హసన్ గంగు). 1358లో రాజ్యానికి వచ్చిన అతని కుమారుడు మహ్మద్‌షా విజయనగర రాజ్యంతోనూ, వరంగల్‌తోనూ యుద్ధాలు చేసి రెంటినీ ఓడించి పెద్ద మొత్తంలో సంపదను స్వాధీనం చేసుకున్నాడు. 1422లో అహ్మద్‌షా
కాలంలో వరంగల్ మీద మరొకసారి దండయాత్ర చేసి చాలా సంపదను దోచుకున్నారు. అతనే 1430లో బీదర్ పట్టణాన్ని నిర్మించాడు. తరువాత బీదరు రాజధాని అయింది. తెలంగాణలోని రాజ్యాలు తమలో తాము పోరాడుతూ, బహమనీలతో స్నేహం చేస్తూ విడిపోతూ కాలం గడిపాయి. నల్లగొండ మొదలైన చోట్ల తిరుగుబాట్లు కూడా జరిగాయి. ఆర్మేనియాలోని టర్కోమెన్ తెగకు చెందిన కులీ ఆ దేశం నుంచి పారిపోయి వచ్చి మహమూద్ షా కాలంలో బీదర్‌లో ఆశ్రయం పొంది, రాజు విశ్వాసాన్ని చూరగొన్నాడు. 1487లో బీదరులో స్థానికులు తుర్కు ఇరానీయుల ప్రాబల్యం మీద తిరగబడి కోటను ముట్టడించినప్పుడు మహమూద్‌షాను, అతని కోటను కాపాడినందుకు కులీమీద తిరుగులేని విశ్వాసం ఏర్పడింది. 1493లో కొంకణంలో చెలరేగిన తిరుగుబాటును అణచినందుకు గాను మహమూద్ షా అతనికి కుతుబుల్ ముల్క్ (రాజ్యానికి స్తంభం వంటివాడు) అనే బిరుదాన్ని ఇచ్చాడు. అలాగే 1486లో ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ జాగీర్‌దార్‌గా నియమించాడు. 1489 నాటికే అహమద్‌నగర్, బీరార్, బిజాపూర్ సుబాలు స్వతంత్రం అయ్యాయి. మహమూద్‌షా 1496లో గోలకొండ కేంద్రంలో తెలంగాణ ప్రాంతానికి గవర్నర్‌గా కులీని నియమించాడు. కొడంగల్‌లోనే నివసిస్తూ కులీ తెలంగాణ రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. క్రమంగా బహమనీ రాజ్యం క్షీణించసాగింది. అయినా కులీ కుతుబ్ షా వేచివున్నాడే తప్ప తిరుగుబాటు చేయలేదు. 1512లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. 1518లో మహమూద్ షా మరణించాడు. కులీ గోలకొండ దుర్గాన్ని మరమ్మత్తు చేయించి సుల్తాన్ కులీ కుతుబ్‌షాగా అక్కడి నుంచి పాలించడం మొదలుపెట్టాడు. గోలకొండ మట్టికోట మీద నుంచి రాతి దుర్గాన్ని నిర్మించి దానికి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు.
కులీ కుతుబ్ షా వంశం 1512 నుంచి 1687 వరకు 150 సంవత్సరాలకు పైగా దక్కన్‌ను పాలించింది. కులీ కుతుబ్‌షా శ్రీ కృష్ణదేవరాయల (1509–1529) కూ, అచ్యుత దేవరాయుల (1530–1542) కూ సమకాలికుడు. కులీ విజయనగరంతోనూ, ఖమ్మంమెట్టు రాజులతోనూ యుద్ధాలు చేశాడు. రాచకొండ, దేవరకొండలను జయించాడు. షితాబు ఖాను అను సీతాపతి రాజుతో వరంగల్‌లో యుద్ధం చేసింది ఈ గోలకొండ రాజే. మహమ్మదీయ మతంలో షియా తెగకు చెందిన కులీ 98 సంవత్సరాలు జీవించాడు. 1543లో కులీ గోలకొండలో నమాజ్ చేస్తుండగా తన కుమారుడు జంషీద్ అలీ చేతుల్లో హత్యకు గురి అయ్యాడు.
జంషీద్ అలీ 1543లో రాజ్యానికి వచ్చి ఏడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. 1550లో అతను వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఆ తరువాత అతని ఏడు సంవత్సరాల కుమారుడిని సింహాసనం మీద జంషీద్ అలీ భార్య, కొందరు మంత్రులు ప్రతిష్టించారు. కానీ, ఏడునెలల తరువాత, జంషీద్ అలీ కాలంలో విజయనగరానికి వెళ్ళి తలదాచుకున్న కులీ కుతుబ్ షా చిన్న కుమారుడు ఇబ్రహీం తిరిగి గోలకొండకు వచ్చి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతనే సుప్రసిద్ధుడైన మల్కిభరాముడు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరంలో ఆశ్రయం పొంది తెలుగు మీద అభిమానం పెంచుకున్న ఇబ్రహీం తన ఆస్థానంలో తెలుగు కవులను, పండితులను ఆదరించాడు. తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ ను రాసిన పొన్నెగంటి తెలగనార్య, అద్దంకి గంగాధరుడు, సారంగు తమ్మయలు వీరిలో ముఖ్యులు.

Q125

ఖిల్జీ కాకతీయుల మీద దండయాత్రకు రెండోసారి ఎవరిని పంపాడు ?

  1. (1) మాలిక్ కాఫర్Correct answer
  2. (2) ఖుతుబుద్దీన్ ముబారక్
  3. (3) మహమ్మద్ బిన్ తుగ్లక్
  4. (4) ఉలగ్ ఖాన్

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) మాలిక్ కాఫర్

  1. "ఖిల్జీ 1309లో మాలిక్ కాఫర్‌ను కాకతీయుల మీదికి రెండో దండయాత్రకు పంపాడు" అని వ్యాసంలో నేరుగా ఉంది.
  2. ఉలగ్ ఖాన్ (తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్) 1321లో తుగ్లక్‌ల తరఫున వచ్చాడు, ఖిల్జీ పంపలేదు.
  3. ఖుతుబుద్దీన్ ముబారక్ ఢిల్లీ వారసత్వ పోరులో గెలిచిన పాలకుడు.